హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తేతెలంగాణ) : నాగర్జునసాగర్ కుడికాలువ నుంచి ఏపీ ప్రభుత్వం రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏపీ యథేచ్ఛగా ఏడాదిలో 646 టీఎంసీలను తరలించి తెలంగాణ ప్రయోజనాలకు గండికొడితే సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కండ్లు తెరిచి ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని ఆదివారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్న సాగర్ ఆనకట్ట నుంచి ఏపీ దుర్మార్గంగా నీటిని తీసుకెళ్తున్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణ నీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగర్జునసాగర్లో నిల్వ ఉంచిన నీటి కోటాను ఏపీ కొల్లగొడుతుంటే కాంగ్రెస్ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం ఇంతవరకు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
ఈ విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సాగర్, శ్రీశైలం ఆయకట్టు పరిధిలోని రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు కట్టబెడుతున్నదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపును నిలువరించకుంటే హైదరాబాద్‌వాసులు సైతం తాగునీటి కోసం అల్లాడే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.