హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలను గురువారం ఎక్స్ వేదికగా ఖండించారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను తేజస్వీ అవమానించారని దుయ్యబట్టారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితంగానే ‘ప్రత్యేక’ కల సాకారమైందని ఆయన గుర్తుచేశారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం ఘనమైన పోరాట చరిత్రను అవమానించడమేనని నిప్పులు చెరిగారు.
ఎదుగుదలను ఓర్వలేకే అహంకారం
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మాడల్‌గా నిలువడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతున్నదని, తేజస్వీ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని హరీశ్‌రావు మండిపడ్డారు. బీజేపీ అధిష్ఠానం వెంటనే తేజస్వీ వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ వైఖరిని స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావం ఇండియాపాకిస్తాన్ విభజన లాంటిదే అయితే ఆనాడు విభజన బిల్లుకు బీజేపీ ఎందుకు మద్దతిచ్చిందని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ సైతం అనేకసార్లు తెలంగాణపై విషం చిమ్మారని తూర్పారబట్టారు. నాడు మోదీ, నేడు తేజస్వీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.