4.17లక్షల కోట్ల అప్పు తెచ్చి 16లక్షల కోట్ల ఆస్తులు సృష్టించాం. కాళేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు కట్టినం. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టినం. రైతుబంధు కింద 72,972 కోట్లు, రైతుబీమాకు 6,800 కోట్లు.. రుణమాఫీకి రూ.29వేల కోట్లు, ఫ్రీ కరెంట్‌కు 61వేల కోట్లు ఖర్చు చేసినం, రేవంత్కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం అద్భుతంగా నిర్మించినం.
– హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై4 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నికల ముందు అడ్డగోలుగా ఇచ్చిన హామీలను, ఆరుగ్యారెంటీలను అమలుచేయడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను కుంటిసాకులుగా చూపుతున్నది. అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు, ప్రభుత్వ హామీలపై నిలదీస్తున్న ప్రజల దృష్టిని మరల్చేందుకు అబద్ధాలు, అర్ధసత్యాలతో బీఆర్ఎస్పై నెపం మోపేందుకు యత్నిస్తున్నది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తప్పుడు లెక్కలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, విప్ కేపీ వివేకానంద్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నేతలు మన్నె గోవర్ధన్, చిరుమల్ల రాకేశ్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భట్టి అప్పులపై పచ్చి అబద్ధాలు చెప్పారని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెచ్చిన అప్పులను కూడా తమ ఖాతాలో వేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు పూటకో లెక్క చెప్తూ ప్రజలను తప్పువ దోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. తాము తెచ్చిన అప్పు రూ.4.17లక్షల కోట్లేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. భట్టి మాత్రం రూ.8,21,651 కోట్లని చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదాయం సమకూర్చడంలో తమకు అపార అనుభవం ఉన్నదని చెప్పిన భట్టి విక్రమార్క, ఇప్పుడు బీఆర్ఎస్పై నెపంనెట్టి తప్పించుకొనేందుకు యత్నిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. వారి అపారమైన అనుభవం ఏమైంది? కమీషన్ల కోసం నియోగిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ పాలన అట్టర్‌ఫ్లాప్ అయినట్టేగదా? అని నిలదీశారు.
రాష్ట్రం రాకముందు తెచ్చిన అప్పులు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 4నెలల్లోని అప్పులను కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ‘రాష్ట్రం ఏర్పడే నాటికి ఎఫ్ఆర్బీఎం, గవర్నమెంట్ గ్యారెంటీ రుణాలు రూ.84,268 కోట్లు.. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 2023 డిసెంబర్ 7నుంచి 2024 మార్చి 31వరకు ఎఫ్ఆర్బీఎం రుణాలు రూ.15,118 కోట్లను బీఆర్ఎస్ ఖాతాలో వేశారని ఆర్బీఐ రిపోర్ట్‌ను ఉటంకిస్తూ ఆరోపించారు. ‘అంటే రూ.84,268 కోట్లు, రూ.15,118 కోట్లు మొత్తం రూ.99,386 కోట్లు.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడే నాటికి మొత్తం రుణం రూ.5,16,881 కోట్ల నుంచి రూ.99,386 కోట్లు తీసేస్తే రూ.4,17,495 కోట్లు మాత్రమే.. ఇది మీరిచ్చిన వైట్ పేపర్లోనే ఉన్నది. కానీ మొన్న భట్టి మాత్రం ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు తెచ్చి అవే చెల్లించే అప్పులు, గ్యారెంటీ లేకుండా స్వయంగా కార్పొరేషన్లే చెల్లించే అప్పులను కలిపి రూ.8,21,651 కోట్లు చేశారు’ అని తూర్పార బట్టారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం కూడా రూ.4.17లక్షల కోట్లేనని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో తెచ్చిన రుణాలపై సీఎం, డిప్యూటీ సీఎం తలోరకంగా మాట్లాడారని వీడియో చూపుతూ హరీశ్‌రావు ఎండగట్టారు. ‘2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 28, 2026 నాటికి రూ.3,47,294 కోట్లు అన్నరు.. కానీ మొన్న భట్టి మాత్రం రూ.1.77 లక్షల అని చెప్పిన్రు.. పెరుగాల్సిన అప్పు ఎలా తగ్గింది భట్టీ? అని సూటిగా ప్రశ్నించారు. జూన్ 30నాటికి పబ్లిక్ డొమైన్లోని లెక్కల ప్రకారం.. రూ.4.50 లక్షల కోట్లు అని తెలిపారు. ఓ వైపు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులకుప్పగా మార్చిందని దుష్ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఎడాపెడా అప్పులు చేస్తున్నదని విరుచుకుపడ్డారు.
మూడు కార్పొరేషన్లు, డిస్కమ్‌లు, హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా మరో రూ.70వేల కోట్ల అప్పు తేవాలని టార్గెట్‌గా పెట్టుకొన్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇందుకోసం బ్రోకర్లకు రూ.1,200 కోట్లు లంచం ఇచ్చేందుకు సిద్ధపడ్డదని మండిపపడ్డారు. గతంలో రూ.30వేల కోట్ల అప్పులకు రూ.510 కోట్లు లంచంగా చెల్లించారని, ఇప్పుడు రూ.70వేల కోట్ల కోసం రూ.1200 కోట్లు.. మొత్తంగా అప్పుల కోసం రూ. 1710 కోట్ల ప్రజాధనాన్ని బ్రోకర్ల పాల్జేస్తున్నదని ఆరోపించారు.
2024 మార్చి నాటికి ప్రభుత్వం చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ 1,20,944 కోట్లు.. భట్టి చెప్పిన డాక్యుమెంట్లో 02.06.2014 నాటికి ఉన్న ప్రభుత్వం చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.11,609 కోట్లు తీసేస్తే రూ.1.09.335 కోట్లు. 2025-26 బడ్జెట్ ఇన్ బ్రీఫింగ్ బుక్ 14వ పేజీ ప్రకారం.. బీఆర్ఎస్ ఎఫ్ఆర్బీఎం రుణాలు రూ.3,01,484 కోట్లు.. వీటికి ఆఫ్ బారోయింగ్స్ రూ.1,09, 335 కోట్లు కలిపితే రూ.4,10,819 కోట్లు.. ఇదీ కాగ్ చెబుతున్న లెక్కలు.
– హరీశ్‌రావు
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.4.17లక్షల కోట్ల అప్పులు తెచ్చి సుమారు రూ.16లక్షల కోట్ల ఆస్తులు సృష్టించామని హరీశ్‌రావు చెప్పారు. తాము తెచ్చిన అప్పుల్లో కేంద్రం ఉదయ్ స్కీమ్, జీఎస్టీ పరిహారం కింద బలవంతంగా రుద్దిన రుణాలు.. ఫైనాన్స్ కమిషన్ ద్వారా, కరోనాతో అప్పు లిమిట్ పెంచితే తెచ్చినవి అని వివరించారు. జీఎస్డీపీని రూ. 4,51,580 కోట్ల నుంచి 13,13,391 కోట్లకు పెంచినం, తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 నుంచి 3,17,117 కోట్లకు పెంచినం.’అని వివరించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 31 నెలల్లో రూ. 4.50 లక్షల కోట్ల అప్పు చేసి ఉద్ధరించింది ఏంటని నిలదీశారు. ఉచిత బస్సు తప్ప కనీసం ఒక్క రోడ్డయినా వేశారా? అని ప్రశ్నించారు.
సిద్దిపేట/కొండపాక, జూలై 4 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తేనే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని, సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కానీ రేవంత్ సర్కార్ కొత్త కొత్త నిబంధనలతో వ్యాపారాలకు ఇబ్బందులు సృష్టించిందని, ఒకవైపు హైడ్రా చర్యలు, మరోవైపు ప్రతికూల దృక్పథంతో వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశారని మండిపడ్డారు. అనంతరం సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని దవాఖానలో శనివారం గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి సినీ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి హరీశ్‌రావు హాజరయ్యారు. ఏటా 6వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తున్న దవాఖాన చైర్మన్ శ్రీనివాస్ సేవలను కొనియాడారు. చిన్నారులకు పునర్జన్మ కల్పించిన వైద్యులు, అత్యుత్తమ వైద్యం అందిస్తున్న బృందానికి, సిబ్బందికి, ధన్యవాదాలు తెలిపారు.
దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టు తాము ఆరోపణలు చేసిన రెండు నెలలకు సింగరేణిలో బొగ్గు మాయమైన ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం.. అది కూడా అక్రమాలను నిలువరించడంలో విఫలమైన దర్యాప్తు సంస్థకే ఆ బాధ్యతలు అప్పగించడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి అదే సింగరేణిలో జరిగిన వెయ్యికోట్ల సోలార్ పవర్, ఎక్స్‌ప్లోజివ్, డీజిల్ స్కాముల గురించి ఎందుకు మాట్లాడరు? పాకిస్థాన్ సరిహద్దు జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ కోసం రూ.1,400 కోట్లు వెచ్చించి స్థలం తీసుకున్నది కమీషన్ల కోసం కాదా? తెలంగాణలో స్థలం లేదన్నట్టు బుల్లెట్ల వర్షం కురిసే ప్రాంతంలో ప్లాంట్ పెట్టడంలోని అంతర్యమేంటి? వీటి గురించి భట్టి విక్రమార్క నోరుమెదపరేమిటని ప్రశ్నాస్ర్తాలు సంధించారు. దేశవ్యాప్తంగా మెగావాట్ విద్యుదుత్పత్తికి రూ.3కోట్లయితే రూ.7కోట్ల చొప్పు న ఎందుకు కట్టబెట్టారు? జైపూర్ ప్లాం ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందా? క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? పీపీఏ అగ్రిమెంట్ జరిగిందా? ఇవేం లేకుండా టెండర్లు పిలిచి రూ.1,500 కోట్లు ఎలా ఖర్చుచేశారని నిలదీశారు. అప్పులపై కాంగ్రెస్ చెబుతున్న తప్పుడు లెక్కలపై బుక్కులు ప్రింట్ చేయించి ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని స్పష్టంచేశారు.