హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
అందెశ్రీ అకాల మరణం పట్ల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత మృతి చాలా బాధాకరమన్నారు. తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్ధించారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించారు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారానికి అందెశ్రీని ప్రతిపాదించింది. ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
అందెశ్రీ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. సాహితీ వనంలో మహా వటవృక్షం కూలిందన్నారు. అందెశ్రీ మరణం పట్ల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌండ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మన గెండెల్లో చిరస్మరణీయంగా ఉండి పోతారు..
అందెశ్రీ హఠాన్మరణం పట్ల మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి ఇది ఎప్పటికీ పూడ్చలేని లోటన్నారు. మలిదశ ఉద్యమ కెరటమై, రాష్ట్ర సాధన ఆకాంక్షను కోట్లాది ప్రజలు గుండెల్లో బలంగా నిలిపిన చారిత్రక గీతాన్ని అందించారని చెప్పారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. ఆయన సాహితీ సంపద, జయ జయహే తెలంగాణ గీతం ఉన్నంత వరకు అందెశ్రీ మన గెండెల్లో చిరస్మరణీయంగా ఉండి పోతారని చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి అకాల మరణం బాధాకరం.
అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/kzIeiz9x4h— Harish Rao Thanneeru (@BRSHarish) November 10, 2025