ఉద్యోగులకు పీఆర్సీ కోసం మూడు కమిటీలు వేసి కాలయాపన చేశారు. దేశంలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉద్యోగులకు 73 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు ఉత్తమ అవార్డులు వస్తే, కాంగ్రెస్ హయాంలో అప్పులు మిగిలాయి.
-హరీశ్‌రావు
దుబ్బాక, జూన్ 6 (నమస్తే తెలంగాణ): గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభు త్వం ప్లాన్ చేస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు మౌనం వహించడం లో ఆంతర్యమేమిటని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆనంతరం దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ.. అపెక్స్ కమిటీ, అంతర్రా ష్ట్ర అనుమతి, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు కడుతుంటే ఎందుకు మౌ నంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ఎదురించే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదని, ప్రధానిని కూడా ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఏపీ నీటి దోపిడీని అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు ఇకనైనా కండ్లు తెరవాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరారు. 400 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తుంటే ఇటు కాంగ్రెస్ ప్రభు త్వం, అటు కేంద్ర మంత్రులు గుడ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు. బనకచర్లతో గోదావరిలో వాటా కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీశైలం రైట్ కెనాల్ లైనింగ్ పూర్తయితే రోజుకు 90 వేల క్యూసెక్కుల చొప్పున తరలిస్తారని వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కండ్లు తెరిచి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని, జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేద్దామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళుతుందని తెలిపారు. నీతి ఆయోగ్‌లో సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘కృష్ణానదిలో న్యా యమైన వాటా కిందికి వదిలింది మీరు. గోదావరి-బనకచర్ల కడుతుంటే చేతులు కట్టుకుని చూస్తున్నది మీరు.శ్రీశైలం రైట్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దానిని అపకుండా చూస్తున్నది మీరు కాదా?’ అని ప్రశ్నించారు. గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తుంటే ప్రభు త్వం ఎందుకు స్పందించడం లేదని, దీనిపై ఉత్తమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. బీఆర్ఎస్ లైనింగ్ పనులు ఆపేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ చేతకానితనంతోనే పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని చెప్పారు. కేసీఆర్ కొట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్-3 సాధించారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడ ర్ అయితే, మంత్రి ఉత్తమ్ ఆయనను మించిపోయారని హరీశ్ ఎద్దేవా చేశారు. గోబెల్స్ అనేవాడు ఉంటే ఉత్తమ్ అబద్ధాలు చూసి ఉరేసుకుని ఉండేవాడన్నారు.
మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న కాంగ్రె స్ ప్రభుత్వం 500 రోజులు గడిచినా అమలు చేయలేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గోబెల్స్ ప్రచారం తప్ప ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఒక్క డీఏ మంజూరు చేస్తామని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం బాధాకరమని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ కొబ్బరికా య ఎలా కొడుతున్నారో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగ ర్, గంధమల్ల ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలితే గంధమల్లకు గోదావరి జలాలు ఎలా వస్తాయని నిలదీశారు. దీనినిబట్టి కాళేశ్వరంపై కాంగ్రెస్ ఇన్నాళ్లూ చేసింది తప్పుడు ప్రచారమేనని తేలిపోయిందన్నా రు. గంధమల్లకు, మూసీకి వచ్చేది కాళేశ్వ రం నీళ్లేనని, మూసీలో గోదావరి నీళ్లు ఎలా పోస్తారని రేవంత్‌ను ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం-వాస్తవాలు’ అనే అంశంపై వివరిస్తారు.