హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ రుణమాఫీ చేయాలని గవర్నర్‌ను కలవనున్నట్టు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఇప్పటి వరకు 72 వేల ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు. రుణమాఫీకానీ రైతుల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రుణమాఫీ హెల్ప్‌లైన్ సెంటర్‌ను సోమవారం హరీశ్‌రావు పరిశీలించారు.
ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, మేసేజ్లపై ఆరా తీశారు. ఈ వివరాలన్నింటినీ గవర్నర్‌కు, ప్రభుత్వానికి అందచేస్తామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ భవన్లో ఈనెల 6 నుంచి హెల్ప్‌లైన్ సెంటర్(నంబర్ 83748 52619 )ను ప్రారంభించారు. హరీశ్‌రావు వెంట మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నే గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.