రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సరారు.. హిమాచల్ ప్రదేశ్‌లో హైడల్ పవర్ ప్రాజెక్టు కోసం ఉబలాటపడటం దేనికో! అనువుగాని ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి ఎందుకంత ఆరాటమో! ఆ ప్రాజెక్టుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయట పెడుతా.
– హరీశ్
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : అతి పెద్ద కంపెనీ మోసర్బేర్, కేంద్ర సంస్థ ఎన్టీపీసీలే సాధ్యం కాదని వదిలించుకున్న హిమాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డికి అంత ఉబలాటం ఎందుకని, దీనిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నదని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం తమ వద్ద ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ అవినీతిని త్వరలోనే పూర్తి ఆధారాలతో బయటపెడతామని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘కూట్లో రాయి తీయనివాడు ఏట్లో రాయి తీసినట్టు’గా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కార్.. హిమాచల్ ప్రదేశ్‌లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం శోచనీయమన్నారు.
తమను ఎవరూ నమ్మడం లేదని, ఎక్కడా అప్పు పుట్టడం లేదని ప్రతి వేదికపైనా తన చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డి హిమాచల్ ప్రదేశ్‌లో తెల్ల ఏనుగులాంటి హైడల్ ప్రాజెక్టును రూ. 6,200 కోట్లతో నిర్మిస్తామనడం తుగ్లక్ చర్య తప్ప మరోటి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్బేర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ కంపెనీ మూడేండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్‌ని నిర్మించేందుకు టీజీజెన్కో ఎందుకు ఒప్పందం చేసుకున్నదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలుగా ముందుకు సాగని ప్రాజెక్టును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుండటంపై హరీశ్‌రావు అనుమానం వ్యక్తంచేశారు. డీపీఆర్‌లు లేకుండా, హిమాచల్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకొని, అప్‌ఫ్రంట్ ప్రీమియం కింద రూ. 26 కోట్లు చెల్లించి, మరో రూ.26 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడటాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం దివాలా తీసిందన్న రేవంత్ మాటలు ప్రజల్లో పూలు పెట్టడానికేనని అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
మోసర్బేర్ కంపెనీ 2009లో రూ. 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్‌లోని సేలి, మియార్‌లో హైడో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించిందని హరీశ్‌రావు తెలిపారు. అయితే, సాంకేతికంగా ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వంతో ఒప్పందం రద్దు చేసుకున్నదని గుర్తుచేశారు. అనంతరం తాము చెల్లించిన రూ. 64 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వం తిరిగి ఇవ్వకపోవడంతో మోసర్బేర్ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. దీంతో వడ్డీ సహా చెల్లించాలని 2023 జనవరిలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని వివరించారు. అయినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో ఢిల్లీలోని హిమాచల్ భవన్‌ను వేలం వేసి ఆ డబ్బును కంపెనీకి చెల్లించాలని 2024లో హైకోర్టు ఆదేశించిన విషయాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఏడు నెలలకుపైగా మంచు కురిసే ప్రాంతంలో రూ. 6,200 కోట్ల ప్రాథమిక అంచనాతో 510 మెగావాట్ల హైడల్ పవర్ ప్రాజెక్టు కట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతున్నదని ప్రశ్నించిన హరీశ్‌రావు.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని విద్యుత్తుశాఖ మంత్రి భట్టివిక్రమార్కను డిమాండ్ చేశారు. ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్ లేకున్నా, జెన్కో బోర్డు ఆమోదం లభించకున్నా ఎంవోయూ చేసుకొని రూ. 26 కోట్ల ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చించాలని పేర్కొన్నారు.
హైడల్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లోని రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుటాణీని బయటపెట్టాలని, ఈ విషయాన్ని గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, మహాలక్ష్మి, తులం బంగారం, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా భరోసా, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, ఉద్యోగుల డీఏలకు, చివరికి పీఆర్సీ అమలుకు డబ్బులు లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, హిమాచల్ ప్రదేశ్‌లో వదిలేసిన ప్రాజెక్టుకు రూ. 6,200 కోట్లు ఎక్కడిని నుంచి వస్తాయో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.