హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి (ఎంవోఎంబీ) కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు? అని నిలదీశారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసే రేవంత్‌రెడ్డికి.. చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా? కమీషన్లు రావని బిల్లులివ్వడం లేదా? అని ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు అందక రాష్ట్రంలోని ‘మన ఊరు-మన బడి’ పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లిన ఎంవోఎంబీ కాంట్రాక్టర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లులు రాక అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తున్నామని, కుటుంబాలు నడవడం కష్టంగా ఉన్నదని చెప్పారు.
అసెంబ్లీ వేదికగా ‘మన ఊరు-మనబడి’ కాంట్రాక్టర్ల సమస్యలను లేవనెత్తుతానని కాంట్రాక్టర్లకు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. బిల్లులు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని, తద్వారా అడ్మిషన్లు పెరిగి, పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని కేసీఆర్ ఆలోచిస్తే.. రేవంత్‌రెడ్డి ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎంకు రాష్ట్రంలో విద్యారంగంపై ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. గురుకుల విద్యార్థులకు సరిగా అన్నం కూడా పెట్టలేని చేతగాని సరారు ఇది అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.