సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ఎండాకాలం జిల్లాలో 1350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంటనష్టం జరిగిందని, ఇప్పటివరకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం రాజ్‌గోపాల్‌పేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. రాగుల బాలయ్య అనే రైతు, ఆయన సతీమణి బాలమ్మలకు మూడెకరాల పొలం ఉందని, రెండు లక్షల పైనున్న రుణాన్ని అప్పు తెచ్చి కట్టామని ఇంకా రుణమాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ కాలేదని, రైతుబంధు పడలేదనే బాధలో ఉన్నాని చెప్పారు.
‘అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంటల బీమా తెస్తాం, రైతు బంధు రూ.15 వేలు ఇస్తాం, రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. వానకాలం రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగి సగం మందికి వేసామన్నారు ఆ సగం మందికి కూడా పూర్తిగా రైతుబంధు రాలేదు. కేసీఆర్ హయాంలో అందరికీ రైతుబంధు డబ్బులు పడ్డాయి. ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నంబర్లలో అద్దెకరం, పావు ఎకరం ఎక్కువ ఉందనే సాకుతో రైతులకు రైతుబంధు ఆపారు. రూ.9 వేల కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చాం అంటున్నారు. ఇంకా రూ.5 వేల కోట్లు పంటపెట్టుబడి సాయానికి కోతపెట్టారు. వానకాలం రూ.9 వేల కోట్లు, ఈ యాసంగి రూ.5 వేల కోట్లు.. మొత్తం రూ.14 వేల కోట్లు ప్రభుత్వం రైతులకు ఎగబెట్టింది. 14 వేల కోట్లు రైతుబంధు ఎగ్గొట్టి వాటిని రుణమాఫీలో ఇచ్చినట్టు చూపిస్తున్నారు.
కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ రైతుబంధు ఆపలేదు. పంట బీమాకు సంబంధించి బడ్జెట్లో డబ్బులు పెట్టి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. వంట నష్టపరిహారం ఎకరానికి రూ.6 వేలు ఉంటే కేసీఆర్ రూ.10వేలకు పెంచారు. పోయిన ఎండాకాలం సిద్దిపేట జిల్లాలో 1,350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగింది. వాటికి ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆరుగాలం కష్టం చేసిన రైతులకు నోటికాడి బుక్క కొట్టినట్టు అయింది. నంగునూరు మండలంలో 11 గ్రామాల్లో దాదాపు 5,300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించాం. ఒక సిద్దిపేట జిల్లాలోనే 10 వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా. 2500 ఎకరాల హార్టికల్చర్ పంటలు కూడా నష్టపోయాయి.
ఇన్పుట్ సబ్సిడీతోపాటు యాసంగి రైతుబంధు కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతు బీమా విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చాలామంది చనిపోయిన రైతులకు రైతు బీమా అందడం లేదు. వెంటనే చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా డబ్బులను విడుదల చేయాలి. కేసీఆర్ ప్రభుత్వంలో అనేక విత్తనాలు సబ్సిడీ కింద ఇచ్చేవారు. కందులు, పెసర్లు, వరి లాంటి విత్తనాలను సబ్సిడీ కింద ప్రభుత్వం అందించేది. ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలను అందుబాటులో పెట్టి రైతులకు సకాలంలో అందించాలని కోరుతున్నాం. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు వచ్చే వానకాలానికి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కౌలు రైతుల గురించి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. కౌలు రైతుకు రైతుబంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. ఇటు రైతు బంధు రాక ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వడగండ్ల వానకు పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.