సిద్దిపేట, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. తడిసిన వడ్డు రేపటికల్లా మొలకలు వచ్చి పగిలిపోతాయని, కాబట్టి వెంటనే సీఎం స్పందించి అధికారులతో జూమ్ మీటింగ్ పెట్టి తడిసిన ధ్యానాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులపాటు ఇసుక తవ్వకాలను, రవాణాను ఆపివేసి, లారీలను వడ్ల రవాణాకు ఉపయోగించాలని కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను హరీశ్‌రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటా మని, లేకపోతే మిల్లుల దగ్గరకు రావొద్దని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరే మిల్లర్లతో మాట్లాడుకోండని చేతులెత్తేస్తున్నారని చెప్పారు. ఏ-గ్రేడ్ వడ్లను కూడా బీ-గ్రేడ్ కింద రాస్తున్నారన్నారు. రవాణా, హమాలీ, ట్రాక్టర్ల వెయిటింగ్ చార్జీలు, కాంటా డబ్బులు అన్నీ రైతుల నెత్తినే రుద్దుతూ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తొలుత 90 లక్షల టన్నులు కొంటామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్షలే కొంటామనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసపుచ్చుతూ నాటకాలు ఆడుతున్నాయని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వడ్లు, మకలు, సన్ ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనమంటే కాంగ్రెస్ నాయకులు కేంద్రం మీద నెపం నెడుతున్నారని విమర్శించారు. కేంద్రం లో అధికారంలో ఉండి కూడా బీజేపీ వాళ్లు వడ్లు కొనాలని ఇకడ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 80 శాతం వడ్లు కొన్నామని సీఎం హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చొని చెప్పితే నిజాలు జనాలకు తెలియవా? అని నిలదీశారు.