సిద్దిపేట/సిద్దిపేట ఆర్బన్ 9 : మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేతకాక గాలికొదిలేసి కాంగ్రెస్ సర్కార్ తమ్మిడిహట్టి అంటూ డ్రామాలు చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు దుయ్యబట్టారు. కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తూ బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రాజెక్టును కించపరిస్తే ముక్తీశ్వరుడి చేతిలో శిక్ష తప్పదని.. కారుచీకట్లో కాళేశ్వరమే ఆశాదీపమని ఆయన పేర్కొన్నారు. తమ్మిడిహట్టి విషయంలో 150 మీటర్లకు మహారాష్ట్రతో ఒప్పందం జరిగితే, కాంగ్రెస్ సర్కార్ తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదని సూటిగా ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఏడాది కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావుడిగా బావి తవ్వినట్టు కాకుండా ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు కుంగిన రెండు పిల్లర్లకు వెంటనే రిపేర్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద మంత్రుల హడావుడి చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు పని తక్కువ ప్రచారమెక్కువ అన్నట్టు ఉన్నదని విమర్శించారు.
ఒప్పందం నిజమైతే అప్పుడేం చేశారు?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం తమ్మిడిహట్టి వద్ద మహారాష్ట్రతో 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఒప్పందం నిజమే అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. అప్పుడు చేయలేదు, మరి అధికారంలోకి వచ్చి రెండున్నేరేండ్లుగా ఎందుకు పనులు చేయలేదని, 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపారని నిలదీశారు. తమతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని, మీరు ఏ పనిచేసినా అంతా వృథా అవుతుందని ఆ రోజు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయి ఉంటే తమ్మిడిహట్టి వద్ద పనులు ప్రారంభించకుండా.. తోక పనులను చేవెళ్ల వద్ద ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు.
బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్రను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒప్పించాలని ఇటీవల సీఎం అంటడు.. 150 మీటర్లకు అప్పుడే అగ్రిమెంట్ జరిగిందని మంత్రి వివేక్ అంటడు.. ఒకవేళ అగ్రిమెంట్ జరిగి ఉంటే మళ్లీ ఒప్పించడం ఎందుకని నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2024-25 బడ్జెట్లో రూ.2కోట్లు, 2025లో రూ.30 కోట్లు, ఈ ఏడాది రూ.50కోట్లు మొత్తం 82కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో సరిపడా నిధులు ఎందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఏపీలో మూడు చోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణహిత-చేవెళ్లను కట్టకుండా సమయం వృథా చేశారని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే తీరుతో కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కేసీఆర్ నాయకత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా తాను, అధికారులు మహారాష్ట్ర సీఎంను ఒప్పించామని గుర్తుచేశారు.
కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందనే అకసుతోనే పనులు నిలుపుదల
కేసీఆర్‌కు మంచి పేరొస్తుందననే అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బరాజ్‌కు మరమ్మతులు చేయడం లేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఈ మండుటెండల్లో ఈ నిమిషానికి మేడిగడ్డ వద్ద 6,400 క్యూసెకుల నీళ్లు కిందకి వెళ్తున్నాయని, కానీ తమ్మిడిహట్టి వద్ద కేవలం 2వేల క్యూసెకులు మాత్రమే పోతున్నాయని తెలిపారు. కటిక చీకట్లో కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు అని ఎంత కరువొచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే స్థలం మేడిగడ్డ అని కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంజనీర్లతో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ ఎంపీపీలు మాణిక్యారెడ్డి, బాలమల్లు, నాయకులు పూజల వెంకటేశ్వరావు, కాముని శ్రీనివాస్, సోమిరెడ్డి, కోలా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ డీఎన్ఎలోనే కరప్షన్
కనీసం సర్వే లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.2,300 కోట్లు బిల్లులు ఎత్తుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని హరీశ్‌రావు మండిపడ్డారు. కరప్షన్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నదని, కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల పనులు, భూసేకరణకు రూ.3,780 కోట్లు ఖర్చు చేస్తే, మొన్న రేవంత్‌రెడ్డి మాత్రం రూ.11వేల కోట్లని పచ్చి అబద్ధం చెబుతున్నారని నిప్పులు చెరిగారు. నాడు వైఎస్ ప్రాణహిత- చేవెళ్లకు శంకుస్థాపన చేస్తే అది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అని విమర్శించిన రేవంత్‌రెడ్డి, ఈరోజు అదే ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతూ ఊసరవెళ్లి రంగులు మార్చినట్టు తన నైజాన్ని మార్చకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రాజెక్టులపై మంత్రులకు అవగాహన లేదు
సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులు కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్ల బ్యారేజ్‌కు నీళ్లు తెస్తామని మొన్న హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడితే.. సీఎం రేవంత్‌రెడ్డి ఏమో ఎల్లంపల్లికి లిఫ్ట్‌తో నీళ్లు తెస్తామన్నారని, మంత్రి జూపల్లి మాత్రం లిఫ్ట్ అవసరం లేదు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని తమ అవివేకాన్ని బయటపెట్టుకున్నారని చెప్పారు. మంత్రులు తమ అజ్ఞానంతో రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు.