కొలంబో : యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (164 బంతుల్లో 18 ఫోర్లతో 142 నాటౌట్) తన తడాఖా చూపెట్టాడు. టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో అజేయ, అద్భుత శతకంతో మెరిశాడు. రెండో రోజు ఆటలో క్లాసిక్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన పడిక్కల్.. గాయంతో సిరీస్‌కు దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో తుది జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. పడిక్కల్‌తో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (63), కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్) కూడా మెప్పించడంతో శనివారం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 90 ఓవర్లలో 357/8 స్కోరు చేసింది. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు (363) ఆరు పరుగుల దూరంలో నిలిచింది. ఫ్లాట్ పిచ్‌పై ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0), సీనియర్ కీపర్ రిషబ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) పూర్తిగా నిరాశపరిచారు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్, అసంక మనోజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చేతి వేలి గాయానికి గురైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు కూడా దూరంగా ఉన్నాడు.
భారత ఇన్నింగ్స్‌లో పడిక్కల్ ఆటే హైలైట్. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై మైదానం నలుమూలలాఅద్భుతమైన బౌండరీలతో అలరించాడు. ఆట ప్రారంభంలోనే విశ్వ ఫెర్నాండో (1/42) బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎదుర్కొన్న రెండో బంతికే ఔటయ్యాడు. ఈ దశలో స్టాండిన్ కెప్టెన్ రాహుల్‌తో కలిసి పడిక్కల్ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. రాహుల్ నిలకడగా ఆడగా, పడిక్కల్ తనదైన శైలిలో ఫుల్ లెంగ్త్ బంతులను కవర్ డ్రైవ్స్, పాయింట్ మీదుగా కట్ షాట్లతో బౌండరీలు బాదాడు. లంక పేసర్ విజయసుందర బౌలింగ్‌లో వరుస ఫోర్లతో విరుచుకుపడిన పడిక్కల్, షార్ట్ పిచ్ బంతులను అలవోకగా పుల్ షాట్లు ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో నటరాజా స్టయిల్ షాట్లతో కనువిందు చేశాడు. రాహుల్ వెనుదిరిగిన తర్వాత అతనికి జడేజా తోడయ్యాడు. విదేశీ మైదానాల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తానెంత విలువైన ఆటగాడినో నిరూపించిన జడేజా.. మూడో వికెట్‌కు పడిక్కల్‌తో కలిసి 72 పరుగులు జోడించాడు. మరో ఎండ్‌లో తన జోరు కొనసాగిస్తూ 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత దేవదత్ రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లాడు.
భారీ అంచనాలున్న స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆఫ్ స్పిన్నర్ మెండిస్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ తర్వాత మరోసారి స్పిన్ ఎదుర్కోవడంలో బ్యాకప్ కీపర్ ధ్రువ్ జురెల్ (1) తన సాంకేతిక లోపాన్ని బయటపెట్టుకున్నాడు. మెండిస్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడగా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. పంత్, జురెల్ వెంటవెంటనే ఔటైన తర్వాత జడేజా, మానవ్ సుతార్ ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. తొలి విదేశీ పర్యటనలో ఉన్న సుతార్ ఆకట్టుకున్నాడు. ఆట చివర్లో పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి సారాంశ్ జైన్ (22), గుర్నూర్ బ్రార్‌తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. టీ20 స్టయిల్లో బ్యాటింగ్ చేసిన గుర్నూర్ ఆఖరి ఓవర్లలో నాలుగు సిక్సర్లు కొట్టి రెండో రోజు ఆటకు అద్భుత ముగింపు ఇచ్చాడు. చివరి రోజు ఇరు జట్లు చెరో 45 ఓవర్లు బ్యాటింగ్ చేస్తాయి.
లంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 363/8; భారత్ తొలి ఇన్నింగ్స్ : 90 ఓవర్లలో 357/6 ( పడిక్కల్ 142 నాటౌట్, జడేజా 63, సుతార్ 41, మనోజ్ 2/32)