హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలన్నారు.
కాగా, హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయనను కలిసేందుకు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు. హరీశ్‌రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను అడ్డుకున్నారు. ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఎమ్మెల్యేను కలిసేందుకు మీ అనుమతి కావాలా, మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు.
రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసిన బిఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 13, 2024