Harish Rao : ఉద్యోగుల పీఆర్సీ గురించి అడిగితే ఏసీబీ దాడులతో, ప్రశ్నిస్తే సిట్ నోటీసులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారిని సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు.
‘ఇది మన సొంత ఎన్జీవో భవన్. గత 22 సంవత్సరాలుగా ప్రతి గణతంత్ర దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉద్యోగులను, పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ వేడుకల్లో ప్రతీ సంవత్సరం పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మంచి ఉద్యోగులను, ఉపాధ్యాయులను గౌరవించడం అంటే ఈ సమాజాన్ని గౌరవించడమే. మంచిని ప్రేమించడం, దానిని కొనసాగించే ప్రయత్నం చేయడమే మన లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ల రెండు నెలలు దాటింది.
Live: సిద్ధిపేటలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం@BRSHarish https://t.co/py5LHlH9dM
— Office of Harish Rao (@HarishRaoOffice) January 26, 2026
ఇప్పుడు ప్రజలకు నిజమైన పాలన అంటే ఏమిటో అర్థమైంది. కేసీఆర్ పాలనే బాగుండేదని ప్రజలందరూ నేడు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి 42%, మరోసారి 30% చొప్పున మొత్తం 72% పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించుకుంది. నేడు ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదు. మాట్లాడినా, ప్రశ్నించినా ఏసీబీ దాడులతో ప్రభుత్వం భయపెడుతోంది అని హరీశ్ రావు విమర్శించారు.
ఇక విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 95 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకు టెండర్లు పిలిచింది. సుమారు 30 వేల కోట్ల రూపాయల కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేక కాదు, ఇచ్చే మనసు లేకనే ఉద్యోగులకు బకాయిలు ఇవ్వడం లేదు. మూసీ సుందరీకరణకు లక్ష కోట్లు, ఫ్యూచర్ సిటీకి లక్ష కోట్లు, హ్యామ్ రోడ్ల కోసం 15 వేల కోట్లు, గోదావరి నీళ్ల మళ్లింపునకు 8 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 20 వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదం. ఐదు డీఏలు, పీఆర్సీ, జిపిఎఫ్ పైసలు పెండింగ్‌లో ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఏడాది గడిచినా డబ్బులు రావడం లేదు. ఒకటో తారీఖు జీతం వెనుక ఉన్న మతలబు నేను ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసునని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి రూ.1,400 కోట్లు ఉంటే, ఇప్పుడు దానిని రూ.2,400 కోట్లకు పెంచారని హరీశ్ రావు వెల్లడించారు. ఆ పెంచిన రూ.2,400 కోట్లు తీసుకునే ఒకటో తారీకు జీతాలు ఇస్తున్నారని, ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వ ఘనకార్యం ఏమీ లేదని ఆయన అన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18,000 మంది ఉద్యోగులు రిటైరైతే, నెల రెండు నెలల్లోనే అన్ని బెనిఫిట్లు ఇచ్చాం. కానీ నేడు కమిషన్లు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు వచ్చే పరిస్థితి లేదు. రిటైర్డ్ ఉద్యోగులంటే ఈ ముఖ్యమంత్రికి చిన్నచూపు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడింది. ప్రజలు అవసరానికి ప్లాట్లు అమ్ముకుందామన్నా కొనే నాథుడు లేడు.
కేసీఆర్ రాష్ట్ర ప్రతిష్టను, ఆదాయాన్ని పెంచితే.. రేవంత్ రెడ్డి అద్భుతమైన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి దివాలా తీయిస్తున్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, కరెంట్, డీఏలు ఎప్పుడూ ఆగలేదు. నేడు సిద్దిపేటపై ఈర్ష్యతో వెటర్నరీ కాలేజీ, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులను అడ్డుకుంటున్నారు. 10 ఏళ్లలో సిద్దిపేటను 20 ఏళ్లు ముందుకు తీసుకుపోతే, కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట అభివృద్ధి వెనక్కి నెట్టేయబడుతోంది. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మీలో ఒక్కడిలా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, పోరాడుతాం’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.