హైదరాబాద్: నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురం లేకుండా చేస్తున్నదని మండిపడ్డారు. పెండ్లి పేరుచెప్పి పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకో కారణం చెబుతూ నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటాలు పక్కనబెట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు.
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జేటీవోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం. పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతున్నది.
పెళ్ళి పేరు చెప్పి, పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకో కారణం చెబుతూ, నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచార ఆర్భాటం పక్కన బెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియమక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లో ప్రతిభ చాటి, ఏఈ, జేటీవోలుగా నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు.’