హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఓవైపు గులాబీ శ్రేణులు మండిపడుతుండగా మరోవైపు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
కేటీఆర్‌కు మంత్రి కొండా సురేఖ భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలను ఎక్స్వేదిగా ఖండించారు. ‘వారి వద్ద సరైన సమాధానం లేనప్పుడే వ్యక్తిగత దూషణలకు దిగుతారు’ అనే మార్గరెట్ థాచర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కోట్ చేశారు.
రాష్ట్రమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకీడ్చేలా మాట్లాడితే ఎలా? అని మంత్రి కొండా సురేఖను ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘ఆ సంగతి ఎవరు చెప్పారు? వాళ్ల విడాకుల పత్రంలో ఆ వివరాలున్నాయా?’ అని ప్రశ్నించారు. ‘ఎవరో ముక్కూముఖం తెలియని వాళ్లు ఏదో రాశారని బాధపడ్డారు. ఆ బాధ సహజమే. కానీ, సాటి మహిళలను మీరే గౌరవించనప్పుడు అదే గౌరవాన్ని ఆశించటం అత్యాశే కదా!’ అని పేర్కొన్నారు. ఎవరో గిట్టని వాళ్లు కాదు స్వయంగా కాంగ్రెస్ వాళ్లే ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉన్నదని, మహిళల శీలహననం ఎవరు చేసినా తప్పేనని స్పష్టంచేశారు. ‘అధికార బాధ్యతల్లో ఉండి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు ఏది మాట్లాడినా ఎదురు మాట్లాడవద్దు అంటే కుదరదు’ అని తేల్చిచెప్పారు.
కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని మహిళా సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. సినీ రంగంలో ఉన్న మహిళా నటులపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై సినీరంగ పెద్దలు స్పందించాలి. మూసీ, హైడ్రా వల్ల వచ్చిన ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఈ హైడ్రామాను ప్రజలంతా గమనిస్తున్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి.