హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తేతెలంగాణ) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులిస్తూ అప్పటి కేంద్ర జల్‌శక్తి మంత్రి ఉమాభారతి లేఖ రాశారని..కానీ కేసీఆర్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు సైట్‌ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిందని ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఉమాభారతి రాసిన లేఖలోని మొదటి పేజీని చదివి మూడో పేజీలో లేవనెత్తిన అభ్యంతరాలను సీఎం విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమాభారతి ఇచ్చిన లేఖలోని పేజీ 3లోని మూడో పేరాలో తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. మొన్న ఘోష్ కమిషన్, ఇప్పు డు ముఖ్యమంత్రి కూడా మూడో పేజీని వదిలిపెట్టి ఫస్ట్ పేజీనే పరిగణనలోకి తీసుకున్నారని, అందుకే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని కుండబద్దలు కొట్టారు. అదే తరహాలో సభను తప్పుదోవపట్టించినందుకు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘అన్నీ ప్రిపేరయ్యే వచ్చిన.. ఉత్తమన్నా నేను ఉత్తగ రాలే’ అని హరీశ్ చురకలంటించారు. 24.10.2014న సీడబ్ల్యూసీ రాసిన లేఖలో ‘మీరు 2004కు సంబంధించిన వివరాలే ఇచ్చారు. 2013 వరకు ఉన్న పరిస్థితులను వివరంగా తెలియజేయాలని చెప్పింది’ అని గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు 24.11.2014 నాడు తిరిగి సమగ్ర వివరాలతో నివేదించామని, మళ్లీ సీడబ్ల్యూసీ 4.03.2015న 165 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇందులో పై నున్న రాష్ర్టాలు వాడుకొనే 63 టీఎంసీలు కూడా ఉన్నాయని, ప్రాణహిత ప్రాజెక్ట్‌పై పునఃపరిశీలించాలని చెప్పిందని, నీళ్లు లేవనే విషయాన్ని తెలియజేసిందని వివరించారు. తాము చెప్తున్నది అబద్ధమైతే సీడబ్ల్యూసీని ఘోష్ కమిషన్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన మూడు లేఖల్లోనూ తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్న విషయం స్పష్టంగా ఉన్నదని చెప్పారు.
తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం చెప్తూ అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సైతం 15.10. 2013న లేఖ రాశారని హరీశ్ గుర్తుచేశారు. ‘152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు కడితే చంద్రపూర్ జిల్లాలోని 2000 ఎకరాలు, 22 గ్రామాలు ముంపునకు గురవుతాయి..ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకొనేది లేదు’ అని స్పష్టం చేశారని, అప్పటి సీఎం కిరణ్‌కుమార్ సైతం ప్రత్యుత్తరమిచ్చారని గు ర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు నీళ్లులేని చో ట కట్టాలనుకున్న ప్రాజెక్టు స్థలాన్ని నీళ్లున్న చోటుకు మార్చి.. కాంగ్రెస్ చేసిన తప్పును సవరించి ప్రజాధనాన్ని కాపాడిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని స్పష్టంచేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 2009, 2014 లో అనుమతిలిచ్చిన ప్రాణహిత ప్రాజెక్టు పై మళ్లీ కేంద్రాన్ని సంప్రదించడంలోని ఉద్దేశమేంటని ప్రశ్నించారు. అప్పుడు నీళ్లు లేవనే విషయం అప్రస్తుతమని, 1975 నుంచి 20 14 వరకు ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తులో కట్టాలా? 152 మీటర్ల ఎత్తున కట్టాలా? అనే విషయంపై మాత్రమే చర్చ అని చెప్పారు.
సీఎం ఆరోపణలపై హరీశ్ ఘాటుగా స్పందించారు. తమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాని ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం తలకెత్తుకున్నదని విమర్శించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట రూ.11 వేల కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. ఆ ప్రజాధనాన్ని కాపాడేందుకే వ్యాప్కోస్ నివేదిక, సీడబ్ల్యూసీ సూచనల మేరకు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నందున నిర్మించడం సాధ్యంకాదని, నీళ్లున్న మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి చెప్తున్నట్టు 2009 లోనే అనుమతులు వస్తే తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తలేదని సూటిగా ప్ర శ్నించారు. మేడిగడ్డకు మా ర్చితే నీటి ప్రవాహం ఎట్ల పెరుగుతదన్న మంత్రి జూపల్లి మాటలు విడ్డూరమని మండిపడ్డారు. ‘మా ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డకు మార్చుతూ నిర్ణయం తీసుకున్న క్యా బినెట్లో మంత్రుల్లో జూపల్లి, తుమ్మల నాగేశ్వర్రావు కూడా ఉన్నారు’ అని గుర్తుచేశారు. అప్పుడు కాళేశ్వరం ప్రాజె క్టు గొప్పదని పొగిడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మాటామార్చారని ధ్వజమెత్తారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 30, 40 కిలోమీటర్లే కదా అని జూపల్లి అన్న మాటలపై హరీశ్ స్పందిస్తూ తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్ల దూరం ఉంటుందని బదులిచ్చారు. మొత్తంగా మేడిగడ్డ దగ్గర తమ్మిడిహట్టితో పోల్చితే 120 టీఎంసీల నీటి లభ్యత అధికంగా ఉంటుందని స్పష్టంచేశారు.
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టేందుకు రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ సైతం ఆమోదించిందని హరీశ్ గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ సైతం తాడిచెర్ల బొగ్గుగనులు ఉన్నందున నేరుగా మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించడం సాధ్యం కాదని చెప్పి న విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూ సీ, రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ సూచనల మే రకు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి ఎల్లంపల్లికి, అటునుంచి మిడ్‌మానేరుకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. రిటైర్డ్ ఇంజినీర్లు, తాము ఇచ్చిన నివేదికలను ఘెష్ పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని వాపోయా రు. ‘అందుకే మేము పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అనడం లేదు.. పీసీసీ కమిషన్ నివేదిక అంటున్నం’ అని విమర్శించారు.