సంగారెడ్డి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వ్యవహారం కాదని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు హెచ్చరించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్‌లో భూము లు కోల్పోతున్న కొండాపూర్ మండలం రైతులు సోమవారం హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఇష్టారాజ్యంగా మారు స్తూ తమ కడుపుకొట్టే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో తాము భూములు కోల్పోకుండా అలైన్మెంట్లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కోరారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ విషయంలో కొండాపూర్ రైతులు ఆందోళన చెందవద్దని, రైతులు భూములు కోల్పోకుండా బీఆర్ఎస్ పార్టీ, తాను అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఇష్టారాజ్యంగా మారుస్తూ రైతుల పొట్టకొట్టడం దుర్మార్గం అని అన్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యలవల్ల రైతులు పంటభూములను కోల్పోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఉత్తరభాగాన ఆలైన్మెంట్ మార్పు వల్ల కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్, తుమ్మరపల్లి, ఆలియాబాద్, మారేపల్లి, రాండాపూర్తండా, గొటీలగుట్టతండా, మాచేపల్లితండా, శివన్నగూ డెం, గంగారం గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్టు చెప్పారు. గంగారం, శివన్నగూడెం గ్రా మాల్లోని రైతులు మొత్తం భూములను కోల్పోతున్నారని తెలిపారు. ట్రిపుల్ఆర్ ఆలైన్‌మెంట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం చేవెళ్ల -గిర్మాపూర్ మీదుగా ప్రతిపాదించిందని గుర్తుచేశారు.
కానీ రేవంత్‌రెడ్డి తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్ ఆర్ మార్గాన్ని అష్టవంకరలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉండాలని, కానీ 23 కిలోమీటర్ల దూరంలోనే ప్రతిపాదిస్తున్నారని చెప్పారు. సొంతభూములకు మేలు కలిగేలా సీఎం అలైన్‌మెంట్‌ను అడ్డగోలుగా మార్చారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ కండ్ల్లు తెరిచి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆలైన్మెంట్ మార్పుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావును కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, ఎంఏ హకీం, ఎం విఠల్, శ్రీధర్‌రెడ్డి, మల్లేశం, గోవర్థన్‌రెడ్డి, వినోద్, చంద్ర య్య, ఆంజనేయులు, మాణిక్యప్రభు, పరమేశ్వర్, రైతులు పాల్గొన్నారు.