కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ నీటిపారుదలశాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు హాజరయ్యారు. సోమవారం ఉదయం తెలంగాణభవన్‌కు చేరుకున్న హరీశ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు సంఘీభావం తెలిపారు. పార్టీ శ్రేణులు వెంటరాగా అక్కడి నుంచి బీఆర్కే భవన్‌కు చేరుకున్న హరీశ్ కమిషన్ ముందు హాజరయ్యారు. మొత్తం 40 నిమిషాలపాటుసాగిన విచారణలో కమిషన్ అడిగిన 20 ప్రశ్నలకు హరీశ్ సవివరంగా సమాధానమిచ్చారు. పూర్తి ఆధారాలను అందజేశారు. విచారణ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను హరీశ్‌రావు కలిశారు.
హైదరాబాద్ జూన్ 9 (నమస్తేతెలంగాణ) : కాళేశ్వరంపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకూ ఆధారాలతో సహా జవాబు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజె క్టు నిర్మాణానికి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొలేదన్న విషయాన్ని కమిషన్‌కు వివరించినట్టు తెలిపారు. అక్కడ నీటి లభ్యత లేదని, నీటినిల్వకు రిజర్వాయర్లు సరిపోవని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సీడబ్ల్యూసీ చేసిన ప్రతిపాదనలను కమిషన్ ముం దుంచినట్టు చెప్పారు. మహారాష్ట్ర అంగీకరించకపోవడం, వైల్డ్‌లైఫ్ అనుమతులు రాకపోవడం, నీటి లభ్యత లేకపోవడంతో కేంద్ర ప్ర భుత్వ సంస్థ వ్యాప్కోస్ ద్వారా లైడార్ సర్వే చేయించి, సెంట్రల్ వాటర్ కమిషన్‌లోని ఇం జినీరింగ్ నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించిన విషయాన్ని సాక్ష్యాధారాలతో కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని ఉద్ఘాటించారు.
సోమవారం జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు వెళ్లే ముందు కోకాపేటలోని తన నివాసంలో, విచారణ అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీశ్ మీడియాతో మాట్లాడారు. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడడం సరికాదని, లోపల ఒకటి చెప్పి బయట మరొకటి చెప్పడం తప్పవుతుందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డకు బరాజ్‌ను ఎందుకు మార్చారనే విషయంపై ఎక్కువసేపు చర్చ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నించిన విషయాన్ని సోదాహరణంగా వివరించానని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించిందని, ఏడు ప్యాకేజీలు, 27 భాగాలుగా విభజించి టెండర్లు పిలిచిందని వెల్లడించారు.
హెడ్ పనులు మొదలు పెట్టకుండా తోక పనులను మొదలు పెట్టిన విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. కేం ద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని, ఏడేండ్లలో ఒక్క అనుమతీ సాధించలేదని, అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోలేదని, గుంట భూమి కూడా సేకరించలేదన్న విషయాన్ని వెల్లడించినట్టు చెప్పారు. తెలంగాణ నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పట్టించుకోలేదన్న విషయాన్ని కూడా కమిషన్‌కు వివరించానని తెలిపారు. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోమని అప్పటి మహారాష్ట్ర సీఎం చౌహాన్, ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసిన విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
విశ్వ ప్రయత్నాలు చేసినం
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి విశ్వ ప్రయత్నాలు చేశామని హరీశ్ తెలిపారు. అప్ప టి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రఫ్ను కలిసి విన్నవించగా తమ రాష్ట్రంలోని ముంపు గ్రామాల ప్రజలు నిరసన తెలుపుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్లకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారని, ఆ తర్వాత కూడా మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ఐదారుసార్లు సమావేశాలు జరిగిన విషయాన్ని వివరించానని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభు త్వం వచ్చిన తర్వాత కూడా పలుమార్లు తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు అంగీకరించాలని కోరామని చెప్పారు. ‘కేసీఆర్ స్వయంగా తెలంగాణకు చెందిన అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సమక్షంలో అప్పటి సీఎం ఫడ్నవీస్‌ను కలిసి విజ్ఞప్తిచేశారు. కానీ నాటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన మేమెలా ఒప్పుకుంటామని తిరస్కరించిన విషయాన్ని కమిషన్‌కు వివరించామని చెప్పారు. మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్‌లైఫ్ ప్రాజెక్టు ఉన్నదని, ఈ క్రమంలో వైల్డ్‌లైఫ్ అనుమతులు సాధించాలంటే సుప్రీంకోర్టులో పదేండ్లు పోరాడాల్సి వచ్చేదని పేర్కొన్నారు.
వ్యాప్కోస్‌తో సర్వే చేయించి స్థలం ఎంపిక..
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణంపై తమ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని హరీశ్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక కోసం కేసీఆర్ వ్యాప్కోస్‌తో లైడార్ సర్వే చేయించారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. నిపుణులతో చర్చించి, వ్యాప్కోస్, సీడబ్ల్యూసీ ఇంజినీర్ల ప్రతిపాదనల మేరకే నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించిన ట్టు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నట్టుగా తాము సొంతంగా రీడిజైన్ చేయలేదని కుండబద్దలుకొట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు అనుమతులు ఉన్నాయా? అని కమిషన్ ప్రశ్నించగా అన్ని అనుమతులు ఉన్నాయ ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించామని వెల్లడించారు. దేశంలో అనేక ప్రాజెక్టుల లొకేషన్ మార్పు జరిగిందని, ఇందు కు సంబంధించిన ఆధారాలను ఘోష్ కమిషన్‌కు సమర్పించానని చెప్పారు. ప్రాజెక్టు సామ ర్థ్యం గురించి ప్రశ్నిస్తే 141 టీఎంసీలు అని సమాధానమిచ్చానని తెలిపారు. బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు ఉన్నాయని, ఇవన్నీ మనుగడలో ఉన్నాయని చెప్పామన్నా రు. ‘ 3 బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటివినియోగం.. వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం’ అని వివరించినట్లు స్పష్టం చేశారు.
గంధమల్ల, మల్లన్నసాగర్ కాళేశ్వరమే..
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన గంధమల్ల రిజర్వాయర్, మూసీ నదికి 30 టీఎంసీలు తరలించాలని, హైదరాబాద్‌కు నీరందించాలని ప్రతిపాదించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులు కాళేశ్వరంలో భాగమేనని హరీశ్ స్పష్టంచేశారు. కాళేశ్వరం కూలిపోయిందని విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్ గంధమల్లకు ఎలా శంకుస్థాపన చేశారని సూటిగా ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసమున్నదని, అంతిమంగా న్యాయం, ధర్మమే విజయం సాధిస్తాయని చెప్పారు.