Harish Rao | ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టిందని రేవంత్ చెప్తున్నడు. దాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేయలే. కనీసం ముంపు బాధితులకు పరిహారమైనా ఇయ్యలే. శిలాఫలకంపై మంత్రిగా నా పేరున్నది. రేవంత్ అప్పుడు నికర్లు వేసుకొని నా వెనుక తిరిగిండు. కావాలంటే ఆ ఫొటోలు, వీడియోలు పంపిస్తా.
– హరీశ్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): పదేండ్లు రాష్ర్టాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా జగిత్యాల సభలో కేసీఆర్ ఎంతో హుందాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్టేట్మన్లా మాట్లాడితే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కుర్చీని కాపాడుకొనేందుకు స్ట్రీట్మ్యాన్లా మా ట్లాడారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ ర్ హరీశ్‌రావు దెప్పిపొడిచారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో బుధవారం ఈ కేసు విచారణకు రానున్నదని, నాలుగున్నర ఏండ్లుగా రేవంత్‌రెడ్డి స్టే మీద కొనసాగుతున్నారని, స్టే వెకెట్ అయితే పదవిపోయి జైలుకెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు.
ఈ కేసులో ఫిర్యాదుదారు, హోంమంత్రి, ముఖ్యమంత్రి, ముద్దాయి కూడా రేవంత్‌రెడ్డేనని తెలిపారు. కేసు వీగిపోవడానికి ప్రభుత్వం తరఫు న మామూలు లాయర్‌ను పెట్టి, తన తరఫున మాత్రం ప్రముఖ సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారని వివరించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలనే ఢిల్లీలో నిన్న సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపామని, దీనిపై కూడా రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోణలు చేశారని విమర్శించారు.
తన ఢిల్లీ పర్యటనపై విచారణ చేస్తామంటున్న రేవంత్‌రెడ్డిని ఎవరు ఆపారని, తన అనుమతి ఎందుకని, నిర్భయంగా విచారణ జరుపుకోవచ్చని స్పష్టంచేశారు. ‘70 సార్లు ఢిల్లీకి వెళ్లిన మీపై (ముఖ్యమంత్రి) కూడా విచారణ జరిపిస్తే బాగుంటుంది’ అని సూచించారు. ఢిల్లీలో పొద్దున రాహుల్‌ను సాయంత్రం బీజేపీ నేతలను కలుస్తున్న రేవంత్‌రెడ్డి కూడా కేంద్ర సంస్థతో విచారణ జరిపించుకోవాలని డిమాండ్‌చేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ఎల్పీ విప్ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రమణ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణభవన్‌లో హరీశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
జగిత్యాలలో ఏప్రిల్ 20న కేసీఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా రేవంత్‌రెడ్డి మరో సభ పెట్టి మాట్లాడటం ఆయన కుత్సిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని హరీశ్ విమర్శించారు. కేసీఆర్ స్పీచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూసి దాదాపుగా అదే సమయానికి రేవంత్ మైకు పట్టుకోవడం పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా ఉన్నదని, ఇలాంటి తత్వం ముఖ్యమంత్రి స్థాయికి తగదని హితవుపలికారు. మీడియా మేనేజ్మెంట్ చేసినా కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది వీక్షిస్తే, రేవంత్ లైవ్‌ను కేవలం 4 లక్షల మందే చూశారని, కేసీఆర్ వ్యూవర్ షిప్లో కనీసం 10% కూడా రేవంత్‌రెడ్డికి రాలేదని గణాంకాలతో విమర్శించారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో ఈ గణాంకా లే వెల్లడిస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ లైవ్‌లో కేసీఆర్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ అఫీషియల్ లైవ్‌లో కేవలం 54 మందే ఉన్నారని ఆధారాలతో వెల్లడించారు. రెండున్నరేండ్లలో రేవంత్ స్థాయి ఎకడికి పడిపోయిందో, కేసీఆర్ మీద ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉన్నదో ఈ లెకలే చెప్తున్నాయని పేర్కొన్నారు.
తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేమీ లేదని హరీశ్ స్పష్టంచేశారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కోవడానికి సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లామని చెప్పారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ డ్రామాలాడారని, విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏవిధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, మే 6న హైకోర్టులో రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించేందుకు ఢిల్లీ వెళ్లినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీచేసి తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని ఓ ఎమ్మెల్యే అనడం, దాన్ని స్పీకర్ ధ్రువీకరించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
జగిత్యాలలో కేసీఆర్ సభకు పోటీగా అదే సమయానికి మైకు పట్టుకొని పులిని చూసి నక వాతలు పెట్టుకున్నట్టు రేవంత్ తన సంకుచిత బుద్ధిని చాటుకున్నడు. మీడియా మేనేజ్మెంట్ చేసినా కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది వీక్షిస్తే, రేవంత్ లైవ్‌ను కేవలం 4 లక్షల మందే చూసిండ్రు. ప్రజాదరణలో కేసీఆర్‌కు, రేవంత్‌కు నకకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
– హరీశ్‌రావు
సుప్రీంకోర్టులో బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఓటుకు నోటు కేసు విచారణ ఉన్నదని హరీశ్ చెప్పారు. పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి.. ఈ రోజు హోంమంత్రి, ముఖ్యమంత్రిగా, ముద్దయిగా ఆయనే ఉన్నారు కాబట్టి కంప్లయింట్ కూడా ఆయనదేనని చెప్పారు. ఆనాడు సమైక్యవాదులతో చేతులు కలిపి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. ఈ కేసులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు.
ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డి.. జగిత్యాల సభలో కేసీఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రే ఒక ఎకరానికి కిస్తీ వేశారని హరీశ్ విమర్శించారు. ‘కేసీఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయవా రేవంత్‌రెడ్డీ?’ అని ప్రశ్నించారు. నిన్న వేసిన రైతుబంధు కిస్తీ కేవలం కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి పొలిటికల్ జిమ్మికు మాత్రమేనని, ఇంకా రూ.4,000 కోట్లు బకాయి ఉన్నదని మండిపడ్డారు. రైతుభరోసా అనేది రైతులకు పెట్టుబడి సాయమని, కానీ, వడ్లు కల్లాలకు వచ్చినా రైతు భరోసా పూర్తి స్థాయిలో వేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఎన్నికల తర్వాత మిగతా రైతు భరోసా ఇస్తానని రేవంత్ మిర్యాలగూడ, సిద్దిపేట సభల్లో చెప్పారని గుర్తుచేశారు.
ఈ సంవత్సరం సూపర్ ఎల్‌నినో వల్ల కరువు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే రేవంత్‌రెడ్డికి ఇప్పుడు సోయి వచ్చిందని హరీశ్ విమర్శించారు. కాళేశ్వరంపై నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన వ్యక్తి.. ఇవాళ మేడిగడ్డను రిపేరు చేసుకొని వాడుకుంటామని ఒప్పుకొన్నారని, ఇన్నాళ్లు చేసిన ప్రచారమంతా అబద్ధమని ఒప్పుకొన్నందుకు ఆయనకు ధన్యవాదాలు అని తెలిపారు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఏ, బీలు తెలువని రేవంత్‌రెడ్డి.. ఎల్లంపల్లి ప్రాజెక్టు తామే కట్టామని అబద్ధాలు చెప్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచించారంటే.. వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారని గుర్తుచేశారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమేనన్నారు.
కాళేశ్వరం అంటే 3 బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువ, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి లిఫ్ట్, మొత్తంగా 240 టీఎంసీల వినియోగమని హరీశ్ పునరుద్ఘాటించారు. లోయర్ మానేరు నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు, కూడెల్లి, హల్దీ వాగులు పొంగడం, అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిండటం కాళేశ్వరం ఫలితాలు కావా? అని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సముద్రమట్టానికి +148 మీటర్ల ఎత్తులో ఉంటే అకడి నుంచి మిడ్ మానేరు (+318 మీటర్లు), అనంతగిరి (+397 మీటర్లు), రంగనాయకసాగర్ (+490 మీటర్లు), మల్లన్న సాగర్ (+557 మీటర్లు), కొండపోచమ్మ సాగర్ (+618 మీటర్ల) ఎత్తుకు గోదావరి నీళ్లను మోటర్లు లేకుండా ఎలా తీసుకువస్తావు రేవంత్‌రెడ్డీ? అని నిలదీశారు. ఇది ముమ్మాటికీ కాళేశ్వరం లిఫ్ట్ చేసిన ఫలితమేనని స్పష్టంచేశారు. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ పూర్తిచేసినట్టు రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలికారని హరీశ్ మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేయలేదని, కనీసం ముంపు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా తన పేరు ఉన్నదని పేర్కొన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న తన వెనుక రేవంత్‌రెడ్డి నెకర్లు వేసుకొని తిరిగాడని, కావాలంటే ఆనాటి వీడియోలు, ఫొటోలు పంపిస్తానని చురకలంటించారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఆదేశాలతో రూ.2,052 కోట్లు ఖర్చు పెట్టి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇండ్లు కట్టించి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది తాను మంత్రిగా ఉన్నప్పుడేనని స్పష్టంచేశారు. 1953లో ఎస్సారెస్పీ కడితే, 50 ఏండ్లయినా కాంగ్రెస్ నాయకులు 10 లక్షల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని, బీఆర్ఎస్ వచ్చే నాటికి 6 లక్షల ఎకరాలకు నీరందేదని గుర్తుచేశారు. లోయర్ మానేరు కాలువలు బాగుచేసి, 2,000 కోట్లతో కాకతీయ కాలువను ఆధునీకీకరించి 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.
మళ్లీ తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో జవాబు చెప్పాలని హరీశ్ నిలదీశారు. ‘రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా? తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఢిల్లీకి కప్పం కడుతున్నందుకా? 2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా? నెలకు రూ. 2,500 ఇస్తామని మహిళలను దగా చేసినందుకా? సీములు లేవు కానీ రాష్ర్టాన్ని సాములతో నింపినందుకా? సింగరేణిని దోచుకున్నందుకా? హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా? ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా? కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టనపెట్టుకున్నందుకా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టినందుకా? ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలను రోడ్డున పడేసినందుకా? ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసినందుకా? కులవృత్తులను ధ్వంసం చేసినందుకా? ప్రజలు మీకు ఓట్లు ఎందుకు వేయాలి?’ అని నిలదీశారు. ఎన్ని డ్రామాలు ఆడినా ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి నూకలు చెల్లాయని, కాంగ్రెస్‌కు శుభం కార్డు పడిందని, కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, పలాయన పాలన అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు.
రేవంత్‌రెడ్డి పాలన తీరుపై తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని శాసనమండలిలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ నాయకుడు, ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టంచేశారు. ఎప్పడో నిర్ణయించిన జగిత్యాల సభకు పోటీగా కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్, ప్రజాపాలన పేరుతో రేవంత్‌రెడ్డి మరో సభ పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు సభ పెడితే, అదేరోజు సీఎం సభ పెట్టుకోవడం తన రాజకీయ జీవితంలో ఇంతవరకు చూడలేదని మండిపడ్డారు. రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి అనే సోయి మర్చిపోయి, తమ నాయకుడు కేసీఆర్‌పైన రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు దిక్కులేక ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని నియమించిందని, ఆయన కాంగ్రెస్ పార్టీకి ధోకా ఇవ్వడం ఖాయమని చెప్పారు.