హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇవి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయమే రూ.90 వేల కోట్లు అయితే లక్ష కోట్లు కొట్టుకుపోయాయని ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెట్టిన బడ్జెట్ లెకలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే.. మల్లన్నసాగర్లో 25 టీఎంసీల నీళ్లు ఎకడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘సీఆర్ పాటిల్ గారూ.. తెలంగాణకు రండి. ఇకడి రైతులను అడుగుదాం. పారే నీళ్లను.. పండే పంటలను చూపిస్తాం’ అని స్పష్టంచేశారు. ఇదంతా బురద రాజకీయమని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా హాలులో మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు అచ్చం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మాటల్లానే ఉన్నాయని విమర్శించారు.
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులకు నేను సవాల్ విసురుతున్న. తెలంగాణకు రండి. యాదాద్రి భువనగిరి, చొప్పదండి, జగిత్యాల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ రైతులను కలుద్దాం. గలగలా పారుతున్న ఆ గోదావరి నీళ్లు ఎకడివో అడుగుదాం. కాళేశ్వరం నీళ్లతో పండిన పచ్చని పొలాలను చూద్దాం.
-హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నాడు వేనోళ్ల పొగిడిన కేంద్ర మంత్రులు నేడు.. విమర్శించడం ఏమిటని హరీశ్ ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. ‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శం’ అని కేంద్ర మంత్రులు, అధికారులు కొనియాడిండ్రు. ‘ఇది తెలంగాణకు వరప్రదాయిని’ అని కేంద్ర మంత్రి నితిన్ గడరీ, ‘తెలంగాణకు ఇది ముక్తేశ్వర ప్రాజెక్టు’ అని ఆనాటి గవర్నర్ నరసింహన్.. ‘కాళేశ్వరం కంటే గొప్ప ప్రాజెక్టు దేశంలో లేదు’ అని ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ‘గోదావరి నదికి నడకలు నేర్పి జీవనదిగా మార్చారు’ అని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్, ‘దేశంలో ఎకడా లేని విధంగా పనులు జరుగుతున్నాయి.. ప్రాజెక్టు డిజైన్లు, ప్రణాళికలు చాలా బాగున్నాయి’ అని సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుస్సేన్ కితాబునిచ్చారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ ప్రాజెక్టును విజిట్ చేసి ఇదొక అద్భుతం అని చెప్పారు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి సతరించింది. సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు కూడా ప్రాజెక్టును ప్రశంసించారు’ అని గుర్తుచేశారు. ‘ఇటీవలే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం.. ‘2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలే’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది’ అని వివరించారు. వీటికి సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. వీటికి కేంద్ర మంత్రి ఏం సమాధానం చెప్తారు? అని నిలదీశారు.

2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలే అని కేంద్ర ఎకనామిక్ సర్వే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. దీనికి ఏం సమాధానం చెప్తవ్ పాటిల్?
తాజా బడ్జెట్ సమావేశాల్లో సాక్షాత్తూ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డే.. కాళేశ్వరం ప్రాజెక్టులో పారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 2024లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగిందని, 2025లో కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చామని చెప్పారని హరీశ్ గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోతే.. ఈ కొత్త ఆయకట్టుకు పారకం ఎకడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. ‘భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు కాలువలకు వెళ్లి నీళ్లు వదులుతున్నారు కదా? అవి కాళేశ్వరం నీళ్లు కావా? గంధమల్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అది కాళేశ్వరంలో భాగం కాదా? హైదరాబాద్‌కు తాగునీటి కోసం మూసీ పక నుంచి 20 టీఎంసీల నీళ్లు తెస్తామని రూ.8,000 కోట్లతో కాలువలు తవ్వుతున్నరు కదా.. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్నసాగర్ నుంచి ఆ నీళ్లు ఎలా వస్తున్నయి?’ అని నిలదీశారు.
ఈ నిమిషానికి కూడా మల్లన్నసాగర్లో 25 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, వాస్తవాలను మరుగున పడేసి బీఆర్ఎస్పై బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులకు హరీశ్ సవాల్ విసిరారు. ‘మీరు తెలంగాణకు రండి. యాదాద్రి భువనగిరి, చొప్పదండి, జగిత్యాల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ రైతులను కలుద్దాం. గలగలా పారుతున్న ఆ గోదావరి నీళ్లు ఎకడివో అడుగుదాం. కాళేశ్వరం నీళ్ల వల్ల పండిన పచ్చని పొలాలను చూద్దాం’ అని సూచించారు. సిద్దిపేటలో ఈ నిమిషానికి 80,000 ఎకరాల పంట పండింది. అవన్నీ కాళేశ్వరం నీళ్లతో పండిన పంటలే కదా!’ అని స్పష్టంచేశారు.
సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 20 ఉత్తరాలు రాశానని, ప్రభుత్వం కేవలం రూ.50 కోట్లు విడుదల చేస్తే.. కొత్తగా ఏడాదికి రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని హరీశ్ చెప్పారు. కానీ ఆ నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణపై పగబట్టిందని విమర్శించారు. కరీంనగర్, నల్లగొండ, యాదాద్రి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 50 కోట్లు ఇస్తే రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయని చెప్పారు. కానీ, అలా నీళ్లు ఇస్తే కాళేశ్వరం పోయిందని తాము చెప్పిన అబద్ధం ఎకడ బయటపడుతుందోననే అకసుతో రైతులకు శిక్ష వేస్తున్నారని విమర్శించారు. ‘మా మీద మీకు పగ, ద్వేషం ఉంటే మాకు శిక్ష వేయండి. కానీ రైతుల పొట్ట కొట్టకండి. తక్షణమే ఆ నిధులు విడుదల చేసి కాలువలకు నీళ్లు వదలాలి. చిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది. మాకు శాసనసభ మాత్రమే వేదిక కాదు. ప్రజాక్షేత్రంలో అన్ని వేదికలపైనా ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతాం. కేసీఆర్ ఆదేశాల మేరకు, ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అని తేల్చిచెప్పారు.