హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ) : ‘సిగాచి బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన కోటి పరిహారం ఏమైంది? బాధితులకు ఇచ్చింది రూ.24 లక్షలే.. రూ.74 లక్షలు బాకీ పడ్డది నిజంకాదా? ఇదీ ముఖ్యమంత్రి మాటతప్పడం కాదా?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యవైఖరిని ఎండగట్టారు. గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచిలో ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, బీమా నగదు కూడా ప్రభుత్వం ఇప్పించే పరిహారంలో చూపించడం, చికిత్స ఖర్చుల్లో కోత విధించడం కాంగ్రెస్ సర్కార్ దిగజారుడు తనానికి నిదర్శమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల పరిహారం ఇప్పించే సోయి రాష్ట్ర సర్కారుకు లేదా? అని నిలదీశారు. ఆచూకీ దొరకని ఎనిమిది మందికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
54 మంది కార్మికులను పొట్టనబెట్టుకున్న సిగాచి దుర్ఘటన బాధితులకు రూ.కోటి పరిహారం ఇస్తామని, కేవలం కంపెనీ తరఫున రూ.25లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు హరీశ్‌రావు విమర్శించారు. పరిహారం ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని.. కార్మికులను కోల్పోయిన కుటుంబాల హక్కు అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. చికిత్స పొందుతూ మరణించినవారి ఖర్చులను కూడా పరిహారంలో చూపడం రేవంత్‌రెడ్డి అమానవీయ పాలనాతీరుకు అద్దం పడుతున్నదని ధ్వజమెత్తారు. మూడు నెలల్లో డెత్ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పిన యంత్రాంగం.. ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. నిబంధల పేరిట ఆచూకీ దొరకని వారిని మృతులుగా పరిగణించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కాపాడుతున్నదని హరీశ్‌రావు నిలదీశారు. బాధ్యులను అరెస్టు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదు ఎందుకని ప్రశ్నించారు. సిట్‌తో విచారణ చేయాలనే డిమాండ్‌ను పట్టించుకోకపోవడంలోని ఆంతర్యమేంటని నిలదీశారు. దర్యాప్తు ముసుగులో యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం యత్నించడం సిగ్గుచేటని తూర్పారబట్టారు. కరోనా వేళ వలస కార్మికులను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారని తెలిపారు. అన్నంపెట్టి కడుపునింపి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయించి సొంతూళ్లకు పంపించిన ఘనత ఆయనకే దక్కిందని గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం వలస కార్మికుల మరణాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాల ఉసురు ప్రభుత్వ పెద్దలకు తగులుతుందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.