హైదరాబాద్ : బనకచర్లతో తెలంగాణ జరిగే అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుగానే పసిగట్టి రణభేరి మోగించిందని, అయినా రేవంత్ సర్కారు మొద్దునిద్ర వీడలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ రణభేరి మోగించిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బల్లెంపెట్టి పొడిచినా రేవంత్ ప్రభుత్వం నిద్రలేవలేదని చెప్పారు. మేం ఎన్నో ప్రెస్మీట్లు పెట్టి హెచ్చరిస్తే గూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. తాను ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టినా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాక్ డేట్ల లెటర్ రాస్తుంటడని ఎద్దేవా చేశారు.
తాను తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెడితే నిన్నటి డేటో, మొన్నటి డేటో పెట్టి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉత్తరం రాసిండని హరీశ్‌రావు చెప్పారు. నిజంగా ముందురోజే ఉత్తరం రాస్తే అప్పుడే రిలీజ్ చేయాలెగదా అన్నారు. తాను ప్రెస్‌మీట్ పెట్టినంకనే రిలీజ్ చేసిండంటెనే ఆ ఉత్తరం బ్యాక్ డేట్లో రాసినట్లేగదా అని చెప్పారు.