హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతడని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎట్ల అన్యాయం జరుగుతదో, ఎట్ల గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కకుండా పోతయో చెబుతూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిందని తెలిపారు. అయినా రేవంత్ సర్కారు ప్రాజెక్టుపై సోయి రాలేదని విమర్శించారు.
తాము బనకచర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణ
ముఖ్యమంత్రులకు మీటింగ్ పెట్టిందని గుర్తుచేశారు. ఆ మీటింగ్‌కు వెళ్లొద్దు, అన్యాయం జరుగుతది అని చెప్పినా రేవంత్‌రెడ్డి వినిపించుకోలేదని అన్నారు. రేవంత్‌రెడ్డి గూడా పోను అని చెప్పిండని, లోపలలోపల ఏమైందోగానీ పోనుపోను అనుకుంటనే పొయ్యి మీటింగ్‌కు హాజరయ్యిండని విమర్శించారు.
ఆ మీటింగ్‌ల ఎజెండా పత్రాలపై సంతకం పెట్టపెట్ట అనుకుంటనే సీఎం సంతకం కూడా
పెట్టిండని ఆరోపించారు. పైగా ఎజెండాలో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశమే లేదని పచ్చి అబద్దాలు చెప్పిండని అన్నారు. దాంతో తాము ఆ ఎజెండా కాపీని బట్టబయలు చేసినమని, అందులో బనకచర్ల గోదావరి ప్రాజెక్టు తొలి అంశంగా ఉన్నదని తెలిపారు.
అయినా రేవంత్‌రెడ్డి అబద్ధపు వాదనే చేసిండని హరీశ్‌రావు అన్నారు. ఈ క్రమంలో ఏపీ నీళ్ల మంత్రి నిమ్మల రమానాయుడు.. రేవంత్‌రెడ్డి బండారాన్ని బట్టబయలు చేసిండని తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ మీటింగ్‌లో గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగిందని, ఆ ప్రాజెక్టుపై ముందుకు పోవడానికి రెండు రాష్ట్రాలు కమిటీ వేసుకోవాలనే నిర్ణయం జరిగిందని చెప్పాడని వెల్లడించారు. దాంతో రేవంత్‌రెడ్డిది నల్లముఖం అయ్యిందని చెప్పారు.