హైదరాబాద్ : తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేసీఆర్ ఊదాసీనత వల్ల తెలంగాణ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నీటి వాటాలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిండంటే ఎవరూ నమ్మరని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణభవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా హరీశ్‌రావు ఏమన్నారంటే.. ‘నీటి పంపకాల కోసం సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్ వేయాలని బీఆర్ఎస్ హయంలో నాటి సీఎం కేసీఆర్ కేంద్రానికి 32 లేఖలు రాశారు. ప్రధానమంత్రికి లేఖలు రాశారు. ఫస్ట్ అఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడారు. సెకండ్ అఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి సెక్షన్-3 సాధించారు. నాడు కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడి ఎంత మేలు చేసిండ్రో.. ఆ తర్వాత సెక్షన్-3 సాధించి కూడా అంతే మేలు చేశారు. సెక్షన్-3 సాధించడం వల్లనే కదా ఇయ్యాల మనం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించగలుగుతున్నాం’ అని అన్నారు.
‘తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ మీద ఇయ్యాల అధికార కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నరు. తెలంగాణ రావాల్సిన నీళ్ల వాటా విషయంలో కొట్లాడకుండా అన్యాయం చేసిండని మాట్లాడుతున్నరు. ప్రాణాలకు తెగించి కొట్లాడి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్.. తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేస్తడంటే ఎవరూ నమ్మరు. సెక్షన్-3 కోసం అప్పటి తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దాంతో కేంద్రం దిగివచ్చింది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటే వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దాంతో రాష్ట్రం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది’ అని చెప్పారు.
‘ఇక్కడ బీజేపీ గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటే వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం.. మాటతప్పింది. మనం 2021 అక్టోబర్ 6న పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే.. వెంటనే ట్రిబ్యునల్ వేయకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం సరిగ్గా రెండేళ్ల తర్వాత.. అంటే 2023 అక్టోబర్ 6న సెక్షన్-3 అమలుకు ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే ఏకంగా రెండేళ్లు తాత్సారం చేసింది’ అని అన్నారు.
‘కేసీఆర్‌ను ఉరి తియ్యాలి అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడు. కేసీఆర్‌ను తీయడం కాదు, అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి శాసనసభ వ్యవస్థను తప్పుదారి పట్టించిన రేవంత్‌రెడ్డి నాలుక కొయ్యాలె’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.