హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ అంటే పోరాటం, త్యాగమని, రేవంత్‌రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని మాజీ మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావునోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ అయితే, ఉద్యమకారుల మీదికి రైఫిల్ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ లేకుంటే, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన లేదు అని, డిసెంబర్ 9న విజయ్ దివస్ లేకుంటే జూన్ 2న తెలంగాణ ఏర్పాటు లేదని స్పష్టంచేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనా.. కేసీఆర్ శవయాత్రనా అన్న నివాదంతో .. ‘నేను చస్తే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి’ అని ప్రాణత్యాగానికి తెగించి పోరాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు.
తెలంగాణభవన్‌లో మంగళవారం నిర్వహించిన విజయ్ దివస్‌కు హరీశ్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అంబేదర్ చిత్రపటానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గులాబీ బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యవాదుల బాటలో నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహమనేది ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపమని, తెలంగాణ ఆస్తిత్వానికి ప్రతీక అని, ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్న తల్లిని రేవంత్‌రెడ్డి మార్చాలనుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ సృష్టించినది నకిలీ తల్లి అని, ఆ తల్లి చేతిలోంచి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు.
రవీంద్రభారతి కంటే ఆర్ఎఫ్సీ అవార్డు గొప్పదా?
ఎన్నికల ముందు తలరాతలు మారుస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తున్నాడని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రెండేండ్లలో చేసింది శూన్యం.. ఎరువుల కొరత తెచ్చిండు. విత్తనాల ధరలు పెంచిండు. కరెంటు కోతలు తెచ్చిండు. రైతుబంధు ఎగ్గొట్టిండు. రైతు బీమా డబ్బులు కట్టకుండా రైతులను గోస పెడుతున్నడు. కాకతీయ తోరణాన్ని, చార్మినార్‌ను చిహ్నం నుంచి తొలగిస్తానంటడు. రవీంద్రభారతి కంటే రామోజీ ఫిలిం సిటీ అవార్డు గొప్పదని మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నడు. కాళోజీ, దాశరథి, గద్దర్ అవార్డులను చులకనచేసి మాట్లాడుతున్నడు. పన్నులు పెంచి, వీసాలు కఠినం చేసి భారతీయులను అనేక ఇబ్బందులు పెడుతున్న ట్రంప్ పేరు హైదరాబాద్‌లో రోడ్డుకు పెట్టడం అంటే భారతీయులను అవమానించడమే. మన పిల్లల ఉద్యోగాలు ఊడగొడుతున్న వ్యక్తికి నీరాజనాలా?’ అని నిలదీశారు
ప్రాణత్యాగానికి సిద్ధమైంది కేసీఆర్ ఒక్కరే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే ఆకాంక్షతో పదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని హరీశ్ స్పష్టంచేశారు. ‘డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటించిన నాటి కాంగ్రెస్ సర్కారు.. ఆ తర్వాత డిసెంబర్ 23న వెనకి తీసుకున్నది. ఆ తేదీని కాంగ్రెస్ విద్రోహ దినంగా జరపాలి.. తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం వెనకి తీసుకున్నప్పుడు చాలా మంది యువత ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యారు. సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నడు.
యాదిరెడ్డి పార్థివదేహాన్ని ఏపీ భవన్‌కు కూడా రానివ్వని దుర్మార్గపు పాలన అది. శవానికి కూడా గౌరవం ఇవ్వలేదు. నాడు మాపై ఢిల్లీలో కేసులు పెడితే నెలల తరబడి తిరిగినం. కేసీఆర్‌వి ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కేసీఆర్ అంటేనే త్యాగాలు. బహుశా దేశంలో ఒక రాష్ట్రం కోసం ఇన్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే. పదవులే కాదు.. ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడాయన’ అని గుర్తుచేశారు. ‘సోనియాగాంధీని నాడు బలి దేవత అన్నది రేవంత్‌రెడ్డే. ఇప్పుడు ఆ సోనియాగాంధీకి గుడి కడతామంటున్నడు. నాడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, చిహ్నాన్ని మార్చేవాడు కాదు’ అని పేర్కొన్నారు.
జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర చేయండి
‘నిమ్స్‌లో చేపట్టిన దీక్ష అప్పటికే 11 రోజులైంది. కేసీఆర్‌కు సోడియం లెవెల్స్ తగ్గిపోయాయి. కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. మనిషి చనిపోతడు అని డాక్టర్లు మాకు చెప్పిండ్రు. నేను పోయి కేసీఆర్‌గారికి దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చేవరకు నా ప్రాణం పోదు. మనం కొట్లాడుదాం అని కేసీఆర్ భరోసా ఇచ్చిండ్రు’ అని హరీశ్ గుర్తుచేశారు. ‘అయితే జైత్రయాత్ర.. లేదంటే శవయాత్ర చెయ్యిండ్రి.. నా శవం మీద తెలంగాణ జెండా కప్పుండ్రి అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయన ఉద్యమంలో ఆమరణ దీక్ష వల్ల, పోరాటం వల్ల వారి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గింది. దేవుని దయవల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నరు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తరు. కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతరు. ఆయన ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తరు’ అని స్పష్టంచేశారు.
నాడు తెలంగాణ పదాన్నే నిషేధించారు
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రాంతమని మాట్లాడితే వెనుకబడిన ప్రాంతమని అసెంబ్లీ సమావేశాల రికార్డుల్లో మార్చారని చెప్పారు. ‘తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డది అని జయశంకర్ సార్ చెప్పేవారు. కేసీఆర్ పోరాటం వల్ల, తెలంగాణ రావడం వల్లే నేడు 24 గంటల కరెంటు, ఇంటింటికీ నీళ్లు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయం, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో పది ఎకరాలు అమ్మితే ఏపీలో ఎకరం భూమి వచ్చేది. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో పది ఎకరాల భూమి వచ్చేది. కానీ నేడు రేవంత్ పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతున్నది’ అని వివరించారు.
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
‘ప్రమాదంలో పడుతున్న తెలంగాణ అస్తిత్వం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి. కేసీఆర్‌ను సీఎం చేసేందుకు అందరం ఏకం కావాలి. నాడు కులమతాలు, వయసులకు అతీతంగా పోరాడినట్టు మళ్లీ పోరాడుదాం’ అని హరీశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు జూలూరి గౌరీశంకర్, అల్లిపురం వేంకటేశ్వర్లు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చిరుమళ్ల రాకేశ్, శివకుమార్, కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్, సుమిత్రాఆనంద్, నాయకులు సునీతా గోపీనాథ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, విప్లవ్‌కుమార్, శుభప్రద్‌పటేల్, రంగినేని అభిలాశ్, కురవ విజయ్, ఉపేంద్ర, గోసుల శ్రీనివాస్, సుశీలారెడ్డి, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
23న కాంగ్రెస్ విద్రోహ దినం: బోయినపల్లి వినోద్‌కుమార్
డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు నాలుక మడతేసిన డిసెంబర్ 23ను కాంగ్రెస్ విద్రోహ దినంగా పాటించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఈ భూగోళం మీద ఉన్నదంటే అందుకు కేసీఆరే కారణమని స్పష్టంచేశారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అసలు ఉద్యమంలో పాల్గొనలేదని, అలాంటప్పుడు కేసీఆర్ దీక్ష గురించి ఆయనకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు రేయింబవళ్లు హరీశ్ లాంటి వారు ఎందరో వెన్నుదన్నుగా నిలిచారని గుర్తుచేశారు. నాడు కొన్ని ఆంధ్రా పత్రికలు.. తెలంగాణ వచ్చేదా? సచ్చేదా? అని రాశాయని, కానీ, కేసీఆర్ ఉద్యమ పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సాధించడంతోపాటు తెచ్చుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు.
విజయ్ దివస్ స్ఫూర్తిగా పనిచేయాలి: దేవీప్రసాద్
తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లేందుకు మళ్లీ కేసీఆర్ నాయకత్వం అవసరమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ చెప్పారు. రాష్ర్టానికి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు విజయ్ దివస్‌ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని నాడు కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అందరం కలిసి పనిచేశామని, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రైల్‌రోకోలు, దీక్షలు, వంటావార్పులు, సాగరహారం వంటి అనేక కీలక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన తెలంగాణను కేసీఆర్ తన పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. కానీ, రెండేండ్లలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.
తెలంగాణ బాపు కేసీఆర్ : మహమూద్ అలీ
‘స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ భారత దేశానికి ఎట్లనో, తెలంగాణకు కేసీఆర్ అట్ల.. తెలంగాణ బాపు కేసీఆర్’ అని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొనియాడారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే 200 ఏండ్లయినా తెలంగాణ వచ్చేది కాదని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చేదా? సచ్చేదా? అని హేళన చేసినా కేసీఆర్ గట్టి పట్టుదలతో మొండిపట్టుతో పోరాటం కొనసాగించారని గుర్తుచేశారు. అప్పుడు, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణకు ద్రోహం చేసే వారే తప్ప మేలు చేసే వారు కాదని విమర్శించారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న వారిలో హరీశ్ లాంటి వాళ్లు ఉన్నారని గుర్తుచేశారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ద్రోహులు రాష్ర్టాన్ని ఏలుతున్నారని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని స్పష్టంచేశారు.
ఉద్యమ చరిత్రపై కాంగ్రెస్ వక్రీకరణ: బండా ప్రకాశ్
తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ వక్రీకరిస్తున్నదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సింహం తన చరిత్రను చెప్పనంత కాలం వేటగాడు రాసుకున్నదే చరిత్ర అవుతుందని చెప్పారు. నిన్ననే సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్‌రెడ్డి అన్నాడని విమర్శించారు. కేసీఆర్ పోరాడకుంటే, యువత అమరులు కాకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. 1969లో ఎందుకు తెలంగాణ రాలేదనని, తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో మన పిల్లలు మరణించారని, అవి ఎన్కౌంటర్లేనని మండిపడ్డారు. మలి ఉద్యమంలో యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారే తప్ప ఎవర్నీ ఏమనలేదనని తేల్చిచెప్పారు. కేసీఆర్ గాంధేయ పద్ధతుల్లో తెలంగాణ సాధించారని గుర్తుచేశారు.కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కొత్త తరానికి నిజమైన చరిత్ర చెప్పాలని పిలుపునిచ్చారు.