హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి అబద్ధాల వరద పారించారని, నిండు సభలో ఆయన చేసిన అసభ్యకరమైన, అత్యంత జుగుప్సాకరమైన మాటలను తెలంగాణ సమాజం క్షమించదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నేడు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన, అసభ్యకరమైన భాషలో అబద్ధాల వరద పారించాడు. అసెంబ్లీలో అబద్ధాలకు ఆసారం లేదంటూనే ఆసాంతం అబద్ధాలనే ప్రయోగించాడు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీవేదికగా ‘భడివే’ వంటి పరమ బూతుపదాన్ని ప్రయోగించిన రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రకమైన రేవంతు బూతు భాషను సభ్యసమాజం క్షమించదని అన్నారు.
నిండు సభలో సీఎం హోదాలో నాలుక కోస్తానంటూ హింసాత్మకమైన, నేరప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడటం రేవంత్ రాజకీయ నీచత్వానికి పరాకాష్ట అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అతి వికృతంగా, సభ్యసమాజం తలదించుకునేలా యథేచ్ఛగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ వారించకపోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితంగా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌పై ఎన్జీటీ స్టే ఇస్తే అది తన గొప్పగా రేవంత్ ప్రచారం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్సే తెచ్చిందనటం రేవంత్ పిచ్చిప్రేలాపన తప్ప మరొకటి కాదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంవో నోట్ ఇస్తే 2014 ఎన్నికల వేళ డీపీఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. డీపీఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికే 5 ఏండ్లు చేసిన మీరా మా గురించి అవాకులుచెవాకులు పేలేదని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గించిన మాట నిజమే అని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదన్నారు. నాడు నల్లగొండలో కేసీఆర్ గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించం అంటూ తీర్మానం చేశారని గుర్తు చేశారు. నేడు బీఆర్ఎస్ నిలదీస్తేనే పోలవరం నల్లమలసాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేశారని, ఇవన్నీ బీఆర్ఎస్ పోరాట ఫలితాలని మర్చిపోవద్దన్నారు.
ఇరిగేషన్ విషయాల్లో రేవంత్‌కు బేసిక్ నాలెడ్జ్ లేదనే విషయం శనివారం అసెంబ్లీ వేదికగా మరోసారి రుజువైందని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్ఎస్ వరద జలాలపై స్టాండ్ తీసుకోవాల్సి ఉండే అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పరమ అజ్ఞానం, అవివేకం అని మండిపడ్డారు. వరద జలాలపై స్టాండ్ తీసుకొని డీపీఆర్ ఇస్తే సీడబ్ల్యూసీ పరిశీలన కాదు కదా, కనీసం స్వీకరించదు అనే ప్రాథమిక విషయం కూడా సీఎంకు తెలియకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోని అంశాలను సగంసగం చదువుతూ, వాక్యాలను వక్రీకరిస్తూ, సభను తప్పుదోవపట్టించిన సీఎం చవకబారు ఎత్తుగడకు తగిన సమాధానాన్ని ఆదివారం తెలంగాణభవన్ వేదికగా తాను ఇవ్వబోయే పీపీటీలో వివరిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలకు, చెప్పిన అబద్ధాలకు తగిన సమాధానం పూర్తి సాక్ష్యాధారాలతో వివరిస్తానని, ముఖ్యమంత్రి పిట్టకథలు, ఉత్తమ్ కట్టు కథలను మీడియా సాక్షిగా తిప్పికొడుతామని హరీశ్‌రావు తెలిపారు.