సిద్దిపేట, అక్టోబర్ 10: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని నర్సాపురానికి చెందిన కొంక శారద- రామచంద్రం దంపతులకు నలుగురు కూతుళ్లు. ఆ నలుగురూ ఎంబీబీఎస్ సీట్ల సాధించడంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతోషం వ్యక్తంచేస్తూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
దర్జీ పని చేస్తూ నలుగురు కూతుళ్లను చదివించడంతో కుమార్తెలు అమ్మానాన్నల కలలను సాకారం చేస్తూ ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వీరిలో పెద్ద కుమార్తె మమత 2018 ఎంబీబీఎస్ ప్రవేశం పొంది డాక్టర్ చదువును పూర్తి చేసుకుంది. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో చదువుతున్నది. ఈ సంవత్సరం మరో ఇద్దరు రోహిణి, రోషిణి జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
ఆ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుపడంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు రూ.50 వేలు సహాయం అందించి వారికి తానున్నానని భరోసా నిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది తెలంగాణ బిడ్డలు ఇక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నారని తెలిపారు. తెల్లకోటు విప్లవంతో పేద విద్యార్థులు వైద్య విద్య కలను సాకారం చేసుకుంటున్నారని చెప్పారు. కేవలం రూ.10 వేల ఫీజులో డాక్టర్ చదువులు చదవగలుగుతున్నారని పేర్కొన్నారు.
హరీశ్‌కు తల్లిదండ్రుల కృతజ్ఞతలు
‘సిద్దిపేట నా కుటుంబం’ అనే మాటను హరీశ్‌రావు నోట ఎప్పుడూ వింటుంటామని, కానీ.. నేడు ప్రత్యక్షంగా చూశామని శారద, రాంచంద్రం దంపతులు పేర్కొన్నారు. సిద్దిపేట కుటుంబ పెద్ద తమకు అండగా నిలిచారని, ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని సంతోషం పంచుకునేందుకు హరీశ్‌రావు దగ్గరికి వచ్చామని, తమ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆర్థిక సహాయం అందించిన ఆయనకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని చెప్పారు.
విద్య విషయంలో తాను ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానని మరోసారి చాటి చెప్పారని, గతంలోనూ ఇద్దరు మెడికల్ విద్యార్థులకు, ముగ్గురు నర్సింగ్ విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చారని, నేడు మరోసారి ఇద్దరు వైద్య విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచి హరీశ్‌రావు మానవత్వాన్ని చాటుకున్నారని వివరించారు.