Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దిమ్మ తిరిగేలా తెలంగాణ పల్లె ప్రజలు తీర్పును ఇచ్చారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం అన్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులను సత్కరించి, అభినందించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. గెలిచిన సభ్యులందరికీ శిరస్సు వంచి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఇది మామూలు విజయం కాదని, ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచ్‌లు 80 నుంచి 90 శాతం గెలుస్తారని.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 40 శాతం సర్పంచులను గెలిచిందని.. అంటే ఇది దేనికి సంకేతం? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒకవైపు రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగిండని.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జిల్లా జిల్లాలు తిరిగినా కూడా జనం బండకేసి కొట్టారన్నారు. గుద్దుడు గుద్దుతే 4వేల సర్పంచులను బీఆర్ఎస్ గెలిచిందన్నారు.
సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనిపిచ్చిండ్రని, రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌కు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడని.. 90 శాతం గెలవాల్సిన అధికార పార్టీ 50శాతం లోపే పరిమితమైందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అని మోసం చేసిండని, రైతుబంధు అని మోసం, రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు, రుణమాఫీ సగం మందికి కూడా కాలేదన్నారు. సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టినవని.. దళిత బంధు బంద్ అయ్యిందని.. కేసీఆర్ కిట్టు బంద్ అయ్యిందన్నారు. చెరువుల్లో చాపలు వేస్తలేరని, గొర్రెల పంపిణీ పథకం బంద్ అయ్యిందన్నారు. ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని మొగవాళ్ళకి డబల్ టికెట్ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అని.. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లమ్మడానికి ఎప్పుడైనా తిప్పలు అయిందా? యూరియా కావాలంటే తిప్పలు అయినాయా ? అన్న హరీశ్‌రావు.. మళ్లీ కేసీఆర్ సార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుందని.. ఊర్లో ఉండి కష్టపడి పని చేసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, బాధ్యతను నిలబెట్టుకోవాలని కొత్ సర్పంచులకు పిలుపునిచ్చారు.
సర్పంచుల అధికారాలపై శిక్షణా కార్యక్రమం పెట్టుకుందామని, ఓడిన వాళ్లు నిరాశ చెందొద్దని, భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పని చేయాలి మళ్లీ గెలవాలని, రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడిగిండ్రని, యూరియా దొరికనప్పుడు ఎందుకు కుర్చీ వేసుకుని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ ప్రశ్నించారు. పగలు రాత్రి రైతులు లైన్లో నిల్చోని యూరియా కోసం తిప్పలు పడ్డప్పుడు.. గురుకులాల్లో పురుగులన్నం మాకొద్దని రోడ్లపై ధర్నా చేసినప్పుడు.. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొననప్పుడు కుర్చీ వేసుకొని కూసోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ హరీశ్‌రావు నిలదీశారు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద రూ.60వేలు రేవంత్ బాకీపడ్డాడని.. సీఎం ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చొని వసూలు చేయాల్సింది పోయి కుర్చీలు వేసుకొని కూర్చుని ఓట్లు అడుగుతారా? అంటూ విమర్శించారు.
ప్రజలు తెలివైనోళ్లని.. అందుకే కాంగ్రెస్‌ను బండకేసి కొట్టి.. బీఆర్ఎస్ను గెలిపించారన్నారు. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ షోకుల కోసం రూ.5కోట్లతో గ్రౌండ్ కట్టించుకోవడం కాదు.. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడడానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినవ్ అంటూ విమర్శించారు. అందాల పోటీ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశావంటూ మండిపడ్డారు. నువ్వు నీ మనుమడు క్రికెట్ ఆడడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? అంటూ నిలదీశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని, మెదక్ గణపురానికి, పాపన్నపేటకి నీళ్లు ఇస్తారా? లేదా చెప్పడం లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు మెదక్ జిల్లాలోని అన్ని మండలాలకు నీళ్లు వచ్చాయా లేదా? అన్నారు. గణపురం ఆనకట్టను బీఆర్ఎస్సే ఆధునికీకరించిందని, బావుల దగ్గర రాత్రిపూట కరెంటు ఉండడం లేదని.. మళ్లీ పాత కాంగ్రెస్ రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పక్షాన నిలబడుదామని, ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని సర్పంచులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని.. మన సర్పంచ్‌లను వార్డు మెంబర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టితే నాకు ఒక మెసేజ్ పెట్టాలని.. తాను డైరెక్ట్ మీకు అండగా ఉంటానన్నారు. సర్పంచుల జోలికొస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని, మిమ్మల్ని తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి.. రెండేళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే వడ్డీతో సహా చెల్లిద్దామన్నారు. పదేండ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశామని, ఈ సారి మన ప్రభుత్వం వచ్చినంక అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. మన జోలికి వచ్చినోళ్ల పని పట్టడానికి కూడా పని చేస్తామన్నారు. అధికారులు న్యాయంగా, ధర్మంగా చేయాలని.. ఏకపక్షంగా పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ పని పడతామంటూ హెచ్చరించారు.