హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ పాలన ముసుగులో రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని శనివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే కాంగ్రెస్ మూకలు దౌర్జన్యానికి దిగాయని ఆరోపించారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న తీరు బిహార్ గ్యాంగ్‌ను తలపిస్తున్నదని నిప్పులుచెరిగారు. ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంపు ఆఫీసులపై దాడులు చేస్తుంటే రాష్టంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా? కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్‌కు ప్రైవేట్ సైన్యంలా మారిందా? అధికార పార్టీ మూకదాడులను అడ్డుకోవడం లేదెందుకు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఒకవైపు హేట్‌స్పీచ్ బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజాపాలన? అని నిలదీశారు. సీఎం, మంత్రులు పొరు గు రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాసామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి, ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎమర్జెన్సీ పాలన తెచ్చారని విరుచుకుపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి.. మీ అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ బెదరదు. ప్రజాక్షేత్రంలో అధికారపక్షాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం.. ప్రజల తరఫున పోరాటం చేస్తాం’ అని తేల్చిచెప్పారు.
అధికార మదంతోనే దాడులు : తలసాని
అధికార మదంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెస్ గూండాల దాడిని అనైతిక చర్యగా అభివర్ణించారు. మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన హస్తం పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని నిప్పులుచెరిగారు. ఆరు గ్యారెంటీలు, హామీల నుంచి దృష్టిమళ్లించేందుకే దుర్మార్గాలకు ఒడిగడుతున్నదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో దాడులు, దౌర్జన్యాలకు స్థానం లేదని స్పష్టంచేశారు.
హామీలు నెరవేర్చడం చేతగాకే : నిరంజన్‌రెడ్డి
హామీలు నెరవేర్చడం చేతగాకే అధికార కాంగ్రెస్ నేతలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టంచేశారు. గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై అధికార పార్టీ గూండాల దాడి శోచనీయమని ఖండించారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీసుపై దాడులు చేయడం అంటే ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడమేనని పేర్కొన్నారు. తెలంగాణ తొలి సీఎం ఆఫీసుకే రక్షణ కల్పించకుంటే ఇక సామాన్యులకెక్కడిదని ప్రశ్నించారు.
తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి : వేముల
కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ మూకల దాడి ముమ్మాటికీ తెలంగాణ ఆత్మగౌరవంపై దాడేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభివర్ణించారు. ప్రజావ్యతిరేకతను తట్టుకోలేకే ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ నేతలను దౌర్జన్యాలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. రెండు మున్సిపాలిటీలను కోల్పోయిన ఫ్రస్టేషన్లో ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ఇలాంటి చిల్లర చేష్టలకు దిగుతున్నదని దుయ్యబట్టారు. బాధ్యాతయుతంగా వ్యవహరించాల్సిన అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. హింసాత్మక ఘటనలతో ఇందిరమ్మ రాజ్యమంటే దాడులు, నిర్బంధాలేనని మరోసారి రుజువైందని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో రేవంత్ రాక్షసపాలన : కొప్పుల ఈశ్వర్
ప్రజాపాలన ముసుగులో రేవంత్‌రెడ్డి రాక్షస పాలన నడుపుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ నేతల దాడి పిరికిపంద చర్య అని మండిపడ్డారు. గ్యారెంటీలకు ఎగనామం పెట్టిన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు, మీడియాపై దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం: పువ్వాడ
గజ్వేల్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన కాంగ్రెస్ గూండాల దాడి ఘటనతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని కోరారు. అధికార పార్టీ నేతలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి దాడులు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రతిష్టకే మాయని మచ్చ: నామా
తెలంగాణ తొలి సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ గూండాల దాడుల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల కార్యాలయాలపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పోలీసుల ప్రేక్షకపాత్ర : దేవీప్రసాద్
‘అధికారం పార్టీయే ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయడం గర్హనీయం. ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు.