హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు.
అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్ కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికం.… pic.twitter.com/ldjpofsse2
— Harish Rao Thanneeru (@BRSHarish) November 4, 2024
మాజీ సర్పంచ్‌లు అరెస్ట్..
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సర్పంచులు సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లుల కోసం పోరుబాటపట్టారు. చల్ హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో సమావేశమైన మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు గుండి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య, గుర్రాలదండి ఆంజనేయులు, దుంప ఆంజనేయులుతోపాటు పలువురు మాజీ సర్పంచులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.