హైదరాబాద్: రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అని, తన రెండేండ్ల పాలనలో చేసింది ఒక్కటైనా చెప్పగలడా అని ప్రశ్నించారు. ప్రజాభవన్‌ను (Praja Bhavan) జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్‌ను కేరాఫ్‌గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెండేండ్ల పాలనపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ రెండేండ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు. రెండేండ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది?. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.
ప్రతీరోజు ప్రజల్ని కలుస్తానని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. నాలుగైదు రోజులు మంత్రులు వచ్చారు.. ఆ తర్వాత వాళ్లు కూడా పత్తా లేరు. ఆ దరఖాస్తులను పట్టించుకున్న నాథుడే లేడు. మేనిఫెస్టోలోని మొదటి కార్యక్రమం, రేవంత్ రెడ్డి మొదటి మాటే తుస్సుమంది. ప్రజా భవన్‌ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. పొద్దుగాల బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు.. మధ్యాహ్నం సెటిల్మెంట్లు.. సాయంత్రం గానా భజానాలు, సంగీత్‌లు, ఎంగేజ్మెంట్లు, విందులు వినోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన గొడుగు నాగరాజు అనే రైతు తనకు సమస్య ఉందని ప్రజా భవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతని ఫోన్‌కు సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చింది.. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు.
కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చి దిద్దితే, రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. కేసీఆర్ ప్రతి ఊరికి పల్లె దవాఖానాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ హాస్పిటళ్లు కడితే, రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి ఒక బారు, పబ్ పెట్టుకోమని చెప్తున్నాడు. ఐటీఐకి, ఐఐటీ, ఐఐఐటీకి తేడా కూడా తెలియని మూర్ఖుడు ఈరోజు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకునేందుకు మహిళలు వారి పిల్లలతో వస్తున్నారు. పెళ్లికి సహాయం చేస్తున్నావా లేక పిల్లల 21వ రోజుకు సహాయం చేస్తున్నావా?. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకానికి ఇవ్వాల్సిన రూ.980 కోట్ల నిధులు పెండింగ్‌లో పెట్టింది.
అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలి. కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే.. తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఒక సిలబస్ మోడల్‌గా పెట్టొచ్చు. ఫైనాన్స్‌లో బిల్లు రావాలి అంటే 30 శాతం ఇవ్వాలి. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్, ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకువచ్చారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలి. రెండేండ్లలో నువ్వు జర్నలిస్టులకు చేసింది ఏంది? . ఒక్క అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. జర్నలిస్టుల సంక్షేమాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చావా?’ అని హరీశ్ రావు దుయ్యబట్టారు.
Live: Former Minister, MLA @BRSHarish addressing the Media at Telangana Bhavan. https://t.co/pniQCejcwI
— BRS Party (@BRSparty) December 8, 2025