తెలంగాణ ప్రాజెక్టులకు ఉరి పేనుతున్న రేవంత్ సర్కార్ ఏపీ పన్నాగంలో పావుగా ప్రభుత్వం నదీజలాలు, నీటి హక్కులపై సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనారాహిత్యం.. తెలంగాణకు మరణశాసనమైంది.. కేసీఆర్ పోరాడి తెచ్చిన ప్రాజెక్టుల అనుమతులను రేవంత్ గాలికొదిలి రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబుకు గురుదక్షిణ కింద తాకట్టుపెడుతున్నడు.. తన రాజకీయ భవిష్యత్తు కోసం కృష్ణా, గోదావరి జలాలను కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు అప్పగించిండు..
– హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): తుంగభద్రపై కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి వారితో చేతులు కలిపారని, రేవంత్‌రెడ్డి గుంపుమేస్త్రీ కావచ్చుకానీ తెలంగాణను నిండాముంచే ముంపుమేస్త్రీగా మారిండని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ టీ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌తో పాటు ఆ శాఖ అధికారులను బయట కూర్చోబెట్టి ఏపీకి చెందిన కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి కాంతారావు సమక్షం లో మూడు రాష్ర్టాల సీఎంలు చీకటి ఒప్పందం చేసుకోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశా రు. చారిత్రక ఒప్పందం అంటూ సంబురాలు చేసుకోవడం కాదు.. చిత్తశుద్ధి ఉంటే అగ్రిమెం ట్ మీటింగ్ మినిట్స్‌ను బయటపెట్టాలని డి మాండ్ చేశారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేస్తూ ఎస్సారెస్పీ స్టేజ్-2 కింద నల్గొండ, వరంగల్ జిల్లాలకు నీరందించే సమ్మక్కసాగర్ను బలిపెడుతున్నారని నిప్పులుచెరిగారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కర్ణాటక తుంగభద్రకు దిగువన, ఆర్డీఎస్కు ఎగువన 35 టీఎంసీల సామర్థ్యంతో నవేలి రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నది.. ఏపీ సర్కార్ ఆర్డీఎస్ దిగువన, సుంకేసుల ఎగువన 20 టీఎంసీల కెపాసిటీతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంచేసింది.. ఇటు కర్ణాటక, అటు ఏపీ కలిసి 55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ’అని ఆందోళన వ్యక్తంచేశారు.
గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని కోల్డ్‌స్టోరేజీలో పెట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వానికే దక్కుతుందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టు అవసరం లేదని 2013 నాటి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తుచేశారు. సిల్టేషన్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి తప్ప కొత్త ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదని, నీటి కేటాయింపులు చేయబోమని తేల్చిచెప్పిందని ప్రస్తావించారు. ఏపీ సర్కార్ గుండ్రేవులను నిర్మించేందుకు ఉపక్రమిస్తే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా ప్రతిఘటించి, నిరసన తెలిపామని గుర్తుచేశారు. తన శిష్యుడైన రేవంత్ సీఎంగా ఉండటాన్ని చూసుకొని, ఎలాగైనా ఏమార్చవచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు గుండ్రేవులను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. తుంగభద్రపై 55 టీఎంసీల నీ టిని కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలు నిలిపివేస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకపోగా, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
నదీజలాలు, తెలంగాణ నీటి హక్కుల విషయంలో రేవంత్ అనేకసార్లు అడ్డంపొడుగు మాట్లాడి అభాసుపాలయ్యారని దెప్పిపొడిచా రు. ‘ఆయనకు భాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ రా ష్ట్రంలో ఉన్నదో తెలియదు.. నల్లమల ఏ బేసిన్లో ఉన్నదో అవగాహనలేదు.. బచావత్ ట్రి బ్యునల్‌కు, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియదు.. అవగాహన తక్కువ.. ఆగమాగం ఎక్కువ’ అంటూ చురకలంటించారు.
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఇప్పటికే సగం వరకు పూర్తయినా మన ప్రభుత్వం అడ్డుకోకుండా మౌనం ఉండటంలో ఆంతర్యమేమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ఇటీవల కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో చిక్కమంచి, చిక్కలపర్వి ప్రాజెక్టులపై తెలంగాణ ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా మౌనంగా ఉండాలని కోరినట్టు స్పష్టంగా ఉన్నది’ అని ఆయన గుర్తుచేశారు. లేఖలో కోరిన విధంగా కర్ణాటకతో కుమ్మక్కయ్యే మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఎగువన కర్ణాటక 35 టీఎంసీల నవేలి, 9.5 టీఎంసీల బరాజ్‌లు నిర్మించి మొత్తం 45 టీఎంసీల నీటిని నిలిపివేస్తే పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
గోదావరి-బనకచర్ల ద్వారా కావేరి అనుసంధానంతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. నదుల అనుసంధానం జరుగాలంటే 968 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులన్నీ ఇవ్వాలని, తెలంగాణ మీదుగా సమ్మక్క-నాగర్జునసాగర్ ద్వారా చేపట్టాలని బీఆర్ఎస్ సర్కార్ ఆనాడే కేంద్రానికి తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు సా ధించకుండా 74 టీఎంసీలు కోల్పోతామనే స్పృహ లేకుండా ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓ వైపు ఏపీ, మరోవైపు కర్ణాటక తమ ప్రయోజనాలు సాధించుకుంటుంటే మన సీఎం మాత్రం ఒప్పుకోవడాన్ని తప్పుబట్టారు. 47 టీఎంసీల సామర్థ్యం కలిగిన సమ్మక్కసాగర్ను బలిపెట్టి నదుల అనుసంధానానికి అంగీకరించడం శోచనీయమని మండిపడ్డారు.
‘ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 147 టీఎంసీల గోదావరి జలాలతో నదులను అనుసంధానించాలని, తెలంగాణ భూభాగం సమ్మక్కసాగర్ మీదుగా నాగార్జునసాగర్ నుంచి వెళ్లాలని, అందులో సగం నీళ్లు అంటే 74టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని, నాడు కేంద్రంతో జరిగిన సమావేశాల్లో వందల సార్లు మినిట్స్ ఆఫ్ మీటింగ్‌ల్లో రి కార్డు చేయించింది’ అని గుర్తుచేశారు. రేవంత్ మాత్రం 968 టీఎంసీల నీటి హక్కుల కోసం ఆలోచించకుండా గోదావరి-బనకచర్ల లింక్‌కు ఓకే చెబుతూ రాష్ర్టానికి తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ 512 టీఎంసీల వాటాను వినియోగించుకొని ఇంటర్ లింక్ పేరిట మరో 200 టీఎంసీలు తరలించాలని చూస్తున్నదని చెప్పారు.
కేసీఆర్ అధికారంలోకి రాగానే కృష్ణా జలా లు పునః పంపిణీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ట్రిబ్యునల్ సాధించారని స్పష్టంచేశారు. నాటి పోరాట ఫలితంగా తెలంగాణకు 700 నుంచి 800 టీఎంసీల వరకు కృష్ణాలో నీటి వాటా దక్కే అవకాశం ఉన్నదని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి అజ్ఞానం.. గురువుకు దక్షిణ చెల్లించుకోవాలనే తపనతో గోదావరి, కృష్ణా జలా ల్లో తెలంగాణకు మరణశాసనంగా మారింది.. ఆయన గతేడాది జూన్ 18న కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీ ఇచ్చి.. ఆ తర్వాత ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారు.. మళ్లీ అదే ఏడాది సెప్టెంబర్ 13న నిర్వహించిన సమీక్షలో కృష్ణా జలాల్లో 904 టీఎంసీలు సాధిస్తామని మాట్లాడారు.. కమిటీ వేయనంటూనే వేసి ఏపీ జలదోపిడీకి రెడ్‌కార్పెట్ పరిచారు.. తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారు’ అని విమర్శలు గుప్పించారు.
‘రేవంత్‌రెడ్డికి తెలివిలేదు.. తెలంగాణ నీటి హక్కులు కాపాడాలనే ధ్యాసలేదు.. ఉత్తమ్‌రెడ్డి నీకైనా కనీసం తెలంగాణ సోయిలేదా? బయట కూర్చొనేందుకు సిగ్గనిపించలేదా? అని హరీశ్‌రావు నిలదీశారు. రేవంత్‌రెడ్డి అవగాహనలేమితో 968 టీఎంసీల గోదావరి నికర జలాలు, నదుల అనుసంధానం, కృష్ణా నికర జలాలు.. ఆర్డీఎస్-తుంగభద్రపై కర్ణాటక, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేతిలో పెట్టడం శోచనీయని మండిపడ్డారు. కేంద్రం చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తున్నదనే స్పృహలేకపోవడం సిగ్గుపొడిచారు. ఈ విషయమై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం డైవర్షన్ కింద 45 టీఎంసీలు, పాలమూరుకు 90 టీఎంసీలు రావాల్సిందేనని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. దీనికి చంద్రబాబు భిక్ష పెట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ‘నదుల అనుసంధానం చంద్రబాబు, మోదీ కల కావచ్చు.. కానీ తెలంగాణను బలిపెట్టవద్దు.. పైన కర్ణాటక 16 టీఎంసీలు కృష్ణానీళ్లు ఆపుకొంటే, కింద ఏపీ గోదావరి నుంచి 16 టీఎంసీలను వాడుకుంటే మధ్యలో నష్టపోయేది తెలంగాణ.. ఈ విషయంలో రేవంత్‌కు కనీస పరిజ్ఞానం లేకపోవడం శోచనీయం’ అని మండిపడ్డారు. జల హక్కులను కాలరాస్తూ ఏపీకి గురుదక్షిణ.. ఎన్నికల సహాయానికి ప్రతిఫలంగా కర్ణాటకకు గురుదక్షిణ చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ ప్రాజెక్టులు ఆపాలని కర్ణాటక, ఏపీలకు లేఖ రాయాలని హితవు పలికారు. ట్రిబ్యునల్ ఎదుట గట్టిగా వాదనలు వినిపిస్తే కృష్ణాలో 700-800 టీఎంసీలు దక్కే అవకాశమున్నదని చెప్పారు.
గోదావరిలో 968 టీఎంసీల నికర కేటాయింపులు ఉండగా, తెలంగాణ వాటా కింద 383 టీఎంసీలకు అనుమతులు సాధించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కిందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు గోదావరిలో కేవలం 265 టీఎంసీలకే అనుమతులు సాధించాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఏడాదికి సగటున 4.48 టీఎంసీలకు అనుమతులు తీసుకొస్తే, బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో ఏడాదికి సగటున 40.36 టీఎంసీలకు అనుమతులు సాధించిందని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో చివరకు 830 టీఎంసీలకు పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చాయని గుర్తుచేశారు. మరో 138 టీఎంసీలకు పర్మిషన్ రావాల్సి ఉన్నదని తెలిపారు. కానీ రెండున్నరేండ్ల రేవంత్ సర్కార్ కనీసం ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.