Harish Rao | హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ): విచారణ అర్హత లేని పిటిషన్ వేసి సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబుకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చి తెలంగాణకు చారిత్రక ద్రోహం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్న సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ కావడం.. మళ్లీ సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టేనని మండిపడ్డారు. అత్యున్నత ధర్మాసనం సాక్షిగా రేవంత్ ద్రోహపు బుద్ధి, నిజస్వరూపం బట్టబయలైందని, ఆయన ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి అనే విషయం తేటతెల్లమైందని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం హరీశ్‌రావు మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు.
నాడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం స్టే సాధించిందని.. ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హతలేని పిటిషన్ వేసిందని ఆరోపించారు. ఈమాత్రం దానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూటూ బూటు వేసుకొని ఢిల్లీ వెళ్లాలా? ఈ మాత్రం విషయం మీ సుప్రసిద్ధ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
ఏపీకి మన నీటి హక్కులు ధారాదత్తం చేసి రేవంత్ సర్కార్ తెలంగాణకు తీరని చారిత్రక ద్రోహం చేసింది. పోలవరం-నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో బలహీనమైన పిటిషన్ వేసి సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబుకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పరోక్షంగా సహకరిస్తున్నడు. ఈమాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తమ్ సూటూబూటు వేసుకొని ఢిల్లీ పోవాల్నా.?
– హరీశ్‌రావు
సివిల్ సూట్ వేస్తామని చెప్పడం అంటే, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనని హరీశ్‌రావు విమర్శించారు. ఏపీ, తెలంగాణతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాదనలు వినడం అనేది ఇక ఏండ్లు గడిచినా ముగియని కథేనని స్పష్టంచేశారు. సుప్రీంలో వాదనలు వినేలోగా చంద్రబాబు ప్రభుత్వం నల్లమల పనులు పూర్తిచేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా తరలించుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం-నల్లమల సాగర్ విషయంలో ముందునుంచీ రేవంత్ సర్కార్ ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తూ దాసోహమవుతున్నదని ఆరోపించారు.
బీఆర్ఎస్ నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం, సుప్రీంకు వెళ్తాం అని నమ్మబలికిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే ద్రోహం చేశారని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ‘పంచాయితీలు వద్దు.. న్యాయస్థానాలు వద్దు.. చర్చలతోనే పరిష్కరించుకుందాం అన్న రేవంత్‌రెడ్డి మాటల్లోని ఆంతర్యమేంటి? ఏపీకి గంపగుత్తగా తెలంగాణ నీటి హక్కులను అప్పజెప్పడమేనా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం నాడు అడుగడుగునా అడ్డుకున్నదని దుయ్యబట్టారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్‌ను తెలంగాణ సమాజం క్షమించబోదని తేల్చిచెప్పారు. గురుదక్షిణ కోసం రాష్ర్టానికి ద్రోహం చేస్తుంటే ప్రత్యేక తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని హరీశ్‌రావు ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగట్టి, నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఆనాడు సీఎం రేవంత్‌రెడ్డి పోనూపోను అంటూనే ఢిల్లీ మీటింగ్‌కు పోయిండు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చలు జరిపిండు. పెట్టబోనూ అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాసిండు. వేయనూవేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకీ రెడ్ కార్పెట్ పరిచిండు. సుప్రీంలో వాదనలు అయ్యేలోగా చంద్రబాబు సర్కార్ నల్లమల పూర్తిచేసి.. నీళ్లను అప్పనంగా తరలిస్తుంది.
– హరీశ్‌రావు