హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న ప్రస్తుత కాలంలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజల గుండెల్లో ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ నినాదం ఒక్కటే మార్మోగుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధికార వేదిక, సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధగీతిక, పదేండ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక, తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక, ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి’ అని పేర్కొన్నారు.
ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకొనే పార్టీ బీఆర్ఎస్ అని ఉద్ఘాటించారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఇక గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని, నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీస్తుందని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.