టన్నెల్లో ప్రమాదం జరిగి పది రోజులైనా రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రాలేదు. ఈ ప్రభుత్వం కనీసం మృతదేహాలను కూడా బయటకు తీసుకురాలేక పోతున్నది. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైంది. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని వారం కింద మంత్రి ఉత్తమ్ చెప్పిండ్రు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పోయి రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నరు. ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తరు?
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులు చేయలేదని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం.. లేదంటే నీ పదవికి రాజీనామా చేస్తవా? అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సోమవారం ఓ చానల్‌తో ఆయన మాట్లాడుతూ తన వైఫల్యాలను ప్రతిపక్షాల మీదకు నెట్టి తప్పించుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని విమర్శించారు. గొంతు పెద్దది చేసి మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కాబోవని హితవు పలికారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు కోసం రూ.3900 కోట్లు ఖర్చుపెట్టి పనులు చేశామని, 11.5 కి.మీ మేర టన్నెల్ తవ్వామని గుర్తుచేశారు. డీవాటరింగ్‌కు కూడా కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇచ్చామని వెల్లడించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌తో పాటు డిండి, పెండ్లిపాక రిజర్వాయర్లను బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేశామని చెప్పారు. టన్నెల్లో ప్రమాదం జరిగి పది రోజులైనా రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కనీసం మృతదేహాలను కూడా బయటకు తీసుకురాలేదని వాపోయారు. ఈ అంశంలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని మండిపడ్డారు. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని వారం క్రితం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఎస్ఎల్బీసీని సందర్శించి రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజుల తర్వాత కూడా కనీసం ఎస్ఎల్బీసీ వద్ద కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఉత్తమ్‌ను బద్నాం చేయడానికే సీఎం రేవంత్ ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు. సీఎం, మంత్రి మధ్య ఉన్న రాజకీయ విభేదాలే 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నాయా? అనే అనుమానం వ్యక్తంచేశారు. ప్రభుత్వ తొం దరపాటు చర్యలతో ఎనిమిది ప్రాణాలు పోయాయని విమర్శించారు.
జాతిపిత గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప ఆ మహాత్ముడికి రేవంత్‌రెడ్డి ఇచ్చే విలువ ఇదేనా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని దుయ్యబట్టారు. 2022లో గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా నాటి సీఎం కేసీఆర్ గాంధీ దవాఖాన ఎదుట ఆవిష్కరించిన గాంధీ కాంస్య విగ్రహంపైనా రేవంత్‌రెడ్డి తన కురుచబుద్ధిని ప్రదర్శించారని సోమవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురుచబుద్ధితో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారు. ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ సిద్ధాంతమైతే రేవంత్‌రెడ్డిది చెడు విను, చెడు చూడు, చెడు మా ట్లాడు అనే సిద్ధాంతం. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రమని చెప్పారు.