హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తేతెలంగాణ): ‘ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకొని 8 మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే..ముఖ్యమంత్రి మాత్రం ఇదేమీ పట్టకుండా ఎన్నికల ప్రచారానికి పోయిండు.. రేవంత్‌రెడ్డికి కార్మికుల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారామా?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని విమర్శించారు. బీఆర్ఎస్కు రాజకీయాల కంటే కార్మికుల ప్రాణాలే ముఖ్యమని, వారంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టును ముట్టగానే పడిపోయిందని.. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ఆక్షేపించారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పనికిరాదు.. అనవసరంగా సొరంగంలో టీబీఎంను ఇరికించారు..రోజుకు మీటర్‌కు మించి తవ్వడం సాధ్యం కాదని అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు’ అని గుర్తుచేశారు.
అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి సూచన మేరకు రెండోరోజే అఖిలపక్ష సమావేశం పెట్టి వారి సలహాలు, సూచనలు స్వీకరించిన విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సూచన మేరకు వెంటనే టెండర్లు పిలిచి రూ.100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని..ఇది ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌పై కేసీఆర్, బీఆర్ఎస్కు ఉన్న కమిట్మెంట్కు నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు 2005లో పనులు ప్రారంభించి 2014 వరకు రూ.3300 కోట్ల మేరకు పనిచేసిందని, కానీ బీఆర్ఎస్ హయాంలో రూ. 3900 కోట్లు వెచ్చించి 9 కిలోమీటర్ల మేరకు తవ్వకం పనులు పూర్తి చేసిందని గుర్తుచేశారు. కరోనా సమయంలోనూ పనులు కొనసాగించామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్ట్‌ను అటకెక్కించారని మంత్రి ఉత్తమ్ కుమార్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనతో పాటు మరో మంత్రి కూడా కేసీఆర్ హయాంలో 5 కిలో మీటర్లు కూడా పూర్తిచేయలేదని తప్పుడు కూతలు కూస్తున్నారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం కూలిపోయిందం టూ కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఏడాదిలో 3 ప్రాజెక్టులు కూలినయ్
కాంగ్రెస్ ఏడాది పాలనలోనే 3 ప్రాజెక్టులు కూలిపోయాయని హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మంలో వచ్చిన వరదలకు పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి తీరని ఆస్తి, పంట నష్టం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తాగునీరందించే సుంకిశాల, ఇప్పుడు ఎస్ఎల్బీసీ కూలిపోయిందని, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, చేతగాని తనానికి ఈ ఘటనలే నిదర్శనమని దెప్పిపొడిచారు.
హెలికాప్టర్ లేకనే ఉత్తమ్ ఇంట్లో ఉన్నడు
ఇంతపెద్ద దుర్ఘటన జరిగి 8 మంది ప్రాణాలు ఆపాయంలో చిక్కుకుంటే ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రచారమే ముఖ్యం కావడం దురదృష్టకరమని హరీశ్ వాపోయారు. ఆయన ప్రచారానికి ప్రభుత్వ హెలికాప్టర్‌ను తీసుకెళ్లడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లోనే ఉండి పోయారని ఎద్దేవాచేశారు. హెలికాప్టర్లేని కారణంగానే ఘటనాస్థలానికి ఉత్తమ్ వెళ్లలేదని దెప్పిపొడిచారు. ఇంతఘోరం జరిగినా ప్రభుత్వం మాత్రం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. గతంలో సుంకిశాల ఘటన జరిగినప్పుడూ ఇదే తరహాలో వ్యవహరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు ప్రజలు బుద్ధిచెప్తారని హెచ్చరించారు.