హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తేతెలంగాణ): ‘కాంగ్రెస్ సర్కారు లైఫ్‌ట్యాక్స్ పెంపు పేరిట పేద, మధ్య తరగతి వర్గాలను దొంగ దెబ్బకొట్టింది..అప్పుజేసో, లోన్తీసుకొనో ఓ కారు కొనుక్కుందామనుకొనే వారి ఆశలపై నీళ్లు చల్లింది..’అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. రూ. 1000 కోట్ల పన్ను భారం మోపి పేదల నడ్డివిరిచిందని గురు వారం ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. సామాన్యుడు రూ. లక్ష ధర కలిగిన బైక్ కొనుగోలు చేయాలంటే రూ. 3300 లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఏకంగా 12 శాతం ఉన్న పన్నును 15 శాతానికి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఆదాయం కోసం పన్నులు పెంచడం కాంగ్రెస్ సర్కారు దుర్మార్గానికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి పేదల రక్తం పీల్చుతున్నదని ధ్వజమెత్తారు. ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్‌కు అపార అనుభవం ఉన్నదని ఎన్నికల వేళ భట్టి విక్రమార్క చెప్పిన మాటలను పన్నుల రూపంలో రేవంత్ నిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘బ్యాంకుల వద్ద అణాపైసా అప్పు పుట్టట్లేదని, ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా దొంగల్లా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకెళ్లేందుకు వచ్చిన దొంగల్లా భావిస్తున్నారని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఖజానా నింపుకొనేందుకు పన్ను మార్గాన్ని ఎంచుకున్నారు..’ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హ్యామ్ మోడల్ పేరిట పల్లె రోడ్లను ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. హ్యామ్ రోడ్లకు రుణాలు సేకరించేందుకే ట్యాక్స్ పెంచిందని ఆరోపించారు. కంపెనీలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు, యాన్యుటీల చెల్లింపునకు టోల్ ద్వారా వసూలు చేయమని చెబుతున్న ప్రభుత్వం దొడ్డిదారిన లైఫ్‌ట్యాక్స్ పేరిట దోచుకుంటున్నదని విమర్శించారు. వెంటనే లైఫ్‌ట్యాక్స్ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్‌కు అపారమైన అనుభవం ఉన్నదని..ఎట్టి పరిస్థితుల్లో పన్నులు పెంచబోం..’అంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయని హరీశ్‌రావు ఆగ్రహించారు. నాడు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని నిప్పులు చెరిగారు. ఆదాయం పెంచడం, సంపద సృష్టించడం, పేదలకు పంచడం తమకు చేతగాదనే విషయం నిరూపించుకున్నదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను తూతూమంత్రంగా అమలుచేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం పన్నుల బాదుడుతో పేద, మధ్య తరగతి వర్గాలను దోపిడీ చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పాలన చేతగాదని, ఆరు గ్యారెంటీలు అమలు సాధ్యం కాదని ఒప్పుకోవాలని, లేదంటే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. లైఫ్ ట్యాక్స్ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.