Deeksha Divas | దీక్షా దివస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు ఒక ప్రతిపాదన చేశారు. ఉద్యమంలో నేను అనే ట్యాగ్‌లైన్‌తో.. తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తుచేస్తూ ఫొటోలను సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఉద్యమ ఫొటోలను రోజుకు ఒకటి షేర్ చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29 చరిత్ర మలుపు తిప్పిన రోజు.. చారిత్రాత్మక రోజు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదని అన్నారు.
జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎక్కడిది రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిది అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ వచ్చింది కాబట్టే సిద్దిపేట జిల్లా అయింది.. సిద్దిపేటకు గోదావరి జలాలు వచ్చాయి.. సిద్దిపేటకు రైలు వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చిందని తెలిపారు. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలిపారు. అనాడు కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నాడు మనం కూడా సిద్దిపేటలో పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. మొత్తం 1531 రోజులు దీక్ష శిబిరం నడిచిందని అన్నారు. అక్కడ రానోళ్ళు లేరు. ప్రతి ఒక్క ఉద్యమ కారుడు వచ్చారని తెలిపారు. కొన్ని వేల మంది దీక్షా శిబిరంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆ శిబిరానికి గుర్తుగా.. చిహ్నంగా ఒక పైలాన్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మోడల్ బస్టాండ్ నిర్మాణంతో దాన్ని తీసేశామని.. మళ్లీ పెడదామని అనుకుంటే ఆర్టీసీ వాళ్లు అనుమతిని ఇవ్వడం లేదని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తు చేస్తూ “తెలంగాణ ఉద్యమంలో నేను” అనే ట్యాగ్ లైన్ తో నాటి ఫోటోలను మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లలో షేర్ చేయాలని దీక్షా దివాస్ సందర్భంగా పిలుపునిస్తున్నాం.#TelanganaUdyamamloNenu #DeekshaDivas pic.twitter.com/vRHqZ15MIc
— Harish Rao Thanneeru (@BRSHarish) November 27, 2025
నాలుగేండ్ల పాటు సిద్దిపేటలో దీక్షా శిబిరం నడిపించుకున్నామని హరీశ్‌రావు అన్నారు. ఆ ఉద్యమ జ్ఞాపకాల కోసం క్యాంపు ఆఫీస్ ముందు ఆ పైలాన్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. మీరందరూ ఏకాభిప్రాయంతో సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసుకొని దీక్షా దివస్ ను ప్రారంభించుకుందామని పిలుపునిచ్చారు. అక్కడి నుండి కోటిలింగాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి వందనం సమర్పిద్దామని.. ముస్తాబాద్ చౌరస్తా లో జయశంకర్ సార్ విగ్రహనికి పూల మాల వేసి, పాత బస్టాండ్ మీదుగా క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్లి పైలాన్ శంకుస్థాపన చేసుకుందామని షెడ్యూల్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఉద్యమ ఫోటో గ్యాలరీ పెట్టుకుందామన్నారు. మీ దగ్గర ఇంకా అరుదైన ఫొటోలు ఉంటే క్యాంపు ఆఫీస్ లో అందించాలని కోరారు. ఆ రోజు అమరుల కుటుంబాలను కూడా సన్మానం చేసుకుందాం. ఆ కుటుంబాలను గౌరవించుకుందామన్నారు. మీ మీ మండలాల్లో ఎవరైనా ఉంటే ఎల్లుండి తీసుకొని రండి.. మంచిగా వారిని గౌరవించుకుందామని చెప్పారు. ఎంత వీలైతే అంత మందిని రమ్మని చెప్పండి. పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమ కారులను తీసుకురావాలన్నారు. ఉద్యమంలో నేను అని.. మీ ఉద్యమ జ్ఞాపకాలను సోషల్‌మీడియా ( ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్)లో నవంబర్ 29వ తేదీ పొద్దున్నుంచి డిసెంబర్ 9 వరకు రోజుకు ఒకటి పంపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.