Harish Rao | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో జరిగిన సమగ్ర అభివృద్ధి కేంద్ర ఆర్థిక సర్వేతో మరోసారి రుజువైందని, ఇది కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, మిషన్ భగీరథ, ఐటీ, నీటిపారుదల రంగం, వీ హబ్‌లలో సాధించిన ప్రగతితో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఆర్థిక స్థిరత్వం, సాగునీటి రంగం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఐటీ విస్తరణ, మహిళా సాధికారతలో అసాధారణమైన అభివృద్ధి జరిగినట్టు పేర్కొన్నారు.
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు అబద్ధాలని ఆర్థిక సర్వేతో రుజువైందని చెప్పారు. మరో ట్వీట్లో.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటని హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు పీసీసీ చీఫ్‌గా రైతుబంధును ఆపి, నేడు సీఎం హోదాలో కేసీఆర్ రైతుబంధు ఇవ్వలేదని బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులు పడతాయని 25 నవంబర్ 2023 పాలకుర్తి పబ్లిక్ మీటింగ్‌లో తాను చెబితే, మరుసటి రో జు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిం ది ఎవరని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఆపేందుకు కుట్ర చేసి, రైతుల నోట్లో మట్టి కొట్టింది ఎవరని నిలదీశా రు. నాడు రేవంత్ చేసిన ఫిర్యాదు లెట ర్, ట్విట్టర్ పోస్టును ఈ సందర్భంగా హరీశ్‌రావు ట్వీట్‌కు జతపర్చారు.