హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారితే.. రేవంత్‌రెడ్డి పాలనలో దేశం ముందు రాష్ట్రం నవ్వులపాలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘గ్లోబల్ ఎన్నారై అండ్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం’ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏడాది పాలన, ఫార్ములా- ఈ రేసు అంశాలపై నిర్వహించిన సమావేశంలో జూమ్ మీటింగ్ ద్వారా హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి అటకెకింది. కేసీఆర్ పాలనలో పురోగమనంలో ఉన్న తెలంగాణ 13 నెలల కాంగ్రెస్ పాలనలో తిరోగమనం పట్టింది. ఆరు గ్యారెంటీల అమలు గురించి మేము అడిగితే రాష్ట్రం దివాలా తీసిందంటూ డ్రామాకు తెరలేపారు. తెలంగాణ అప్పు రూ.4.17 లక్షల కోట్లుగా ఉంటే, రూ.ఏడు లక్షల కోట్లు అనే తప్పుడు ప్రచారం చేశారు. దానిని అసెంబ్లీ సాక్షిగా తిప్పి కొట్టాం’ అని వివరించారు. తాము సగటున ఏడాదికి రూ.40 వేల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ఒక ఏడాదిలోనే రూ.లక్షా 37 వేల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.
2014 వరకు ఎంత పండిందో, బీఆర్ఎస్ పాలనలో ఎంత పండిందో దాచేస్తే దాగని సత్యమని హరీశ్‌రావు స్పష్టంచేశారు. 2014-15లో 68 లక్షల టన్నుల వరి పండితే, 2023-24 నాటికి కోటి 68 లక్షల టన్నుల వరి ఉత్పత్తి సాధించామని వివరించారు. 2014-15లో కోటీ 31 లక్షల ఎకరాలున్న సాగు విస్తీర్ణం, 2023-24 నాటికి రెండు కోట్ల 22 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. రికార్డు స్థాయిలో పంట పండిందని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌రెడ్డికి ఇదంతా ఎలా సాధ్యమైందో తెలియదా? అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు దిగారు. ఈ ప్రభుత్వానికి పగ, ప్రతీకారం తప్ప పాజిటివ్ యాటిట్యూడ్ లేదు.
ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాడనే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఫార్ములా- ఈ రేసు వచ్చేలా చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కేటీఆర్ కృషి చేస్తే.. స్పాన్సర్లను వెళ్లిపోయేలా కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. ఈవెంట్ హైదరాబాద్ నుంచి తరలిపోవడం ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూరనని స్పష్టంచేశారు. ఫార్ములా-ఈ రేసులో ఎకడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పారు.
‘కేసీఆర్ పాలనలో రాష్ట్ర బడ్జెట్ రూ.62 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.14.5 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.3.47 లక్షలకు పెరిగింది. సేల్స్‌ట్యాక్స్ రూ.27 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు చేరింది. ఐటీ ఎగుమతులు రూ.లక్షా పదివేల కోట్ల నుంచి రూ.3.33 లక్షల కోట్లకు చేరాయి. కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్‌మాడల్‌గా నిలిపారు’ అని హరీశ్‌రావు వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసీలు పాల్గొన్నారు.