హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): దేశంలో రెండుసార్లు రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత ఒక్క తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ వివాంతలో 2023-24 ఆర్థిక సంవత్సరం త్రైమాసిక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చొంగ్తూ, ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీ కే హారిక, సెర్ప్ సీఈవో గౌతమ్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్, మెప్మా ఎండీ పమేలా శత్పథి, సీసీఎల్ఏ ఆశిష్ సంఘన్, నాబార్డ్ జనరల్ మేనేజర్ వై హరగోపాల్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతు రుణమాఫీకి దేశంలోని ఇతర రాష్ర్టాలు అనేక పరిమితులు విధించాయని, ఎలాంటి నిబంధన లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రెండుసార్లు రుణమాఫీ చేయడం కేసీఆర్‌కే చెల్లిందని ప్రశసించారు. మొదటి దఫాలో 35 లక్షల మందికి రూ.16,144 కోట్లు, ఈసారి ఇప్పటి వరకు రూ.99,999 రుణాలు కలిగిన 16.66 లక్షల మంది రైతులకు రూ.8098 కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు తెలిపారు. మొత్తం 37 లక్షల మంది రైతులకు రూ. 20,141 కోట్ల రుణాన్ని మాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టు వివరించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి అవుట్ స్టాండింగ్ లోన్లు ఉన్నాయని, వారికి వచ్చిన రుణమాఫీ డబ్బులను పాత అప్పు కింద జమ చేయకుండా నేరుగా రైతులకు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. రైతు ఒకవేళ అప్పటికే రుణం చెల్లించి ఉంటే మాఫీ డబ్బును నేరుగా వారి చేతికి అందించాలని పేర్కొన్నారు. కొందరు రైతులకు కో-ఆపరేటివ్ బ్యాంకు, జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, అలాంటి వారికి రెండు ఖాతాల్లోకి కొంత మొత్తం చేరేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
పంట రుణాన్ని రెన్యువల్ చేసి రైతు చేతికి డబ్బు ఇస్తే ప్రభుత్వం అందించిన సాయం తమ చేతికి వచ్చిందని రైతు భావిస్తాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ఆర్థిక, వ్యవసాయశాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని పేర్కొన్నారు. వారానికి ఒకసారి సమావేశమై ఏ బ్యాంకు నుంచి ఎంతమంది రైతులకు డబ్బు వెళ్లిందో ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని వివరించారు. కరోనా కారణంగా రాష్ట్ర రాబడి తగ్గినా రైతుల ప్రయోజనం కోసం సీఎం కేసీఆర్ రుణమాఫీ అమలు చేస్తున్నారని, బ్యాంకర్లు దీనిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. సాధారణంగా బ్యాంకులు విడతల వారీగా రుణమాఫీ చేస్తూ మూడు నెలలపాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తాయని, కానీ ఈసారి బ్యాంకర్లు కొంచెం శ్రమ తీసుకుని నెల రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు వంటి పథకాల వల్ల రైతులకు భరోసా దకిందని, రుణమాఫీ డబ్బులు నేరుగా వారికి అందిస్తే మరింత సంతోషపడుతారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న వాదాన్ని సీఎం కేసీఆర్ మార్చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ఆర్థిక భారాన్ని మోస్తూనే ఓ పెద్ద కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని కొనియాడారు. తెలంగాణ ఎదుగుదలలో వ్యవసాయం పాత్ర ముఖ్యమైనదని, జీఎస్డీపీలో వ్యవసాయం వాటా 18 శాతం ఉండటం అందుకు నిదర్శమని పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ఆర్థికసాయంతో రాష్ట్రంలో నగదు చలామణి పెరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగం బలోపేతం కావడంతో దాని చుట్టూ అల్లుకున్న రంగాలు బలపడ్డాయని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా రాష్ట్రంలోని కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయని చెప్పారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం నిలదొకుకొనే వరకు చేయూతనందిస్తే అంతకుమించి వ్యవసాయదారులకు చేయాల్సింది ఏమీలేదన్నది కేసీఆర్ ఆలోచన అని వివరించారు. రుణమాఫీలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శులది కీలకపాత్రని ప్రశంసించారు. రైతాంగం తరఫున సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంకులు రూ.24,102 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు ఎస్ఎల్బీసీ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.7,07,108 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు పేర్కొంది. త్రైమాసికంలో పొదుపు రుణాల నిష్పత్తి 119.16 శాతం నుంచి 117.46 శాతం నమోదైనట్టు వివరించింది. బ్యాంకుల ద్వారా ప్రాధాన్యత రంగాలకు రూ.75,040 కోట్ల రుణాలు ఇచ్చినట్టు ప్రకటించింది. వార్షిక లక్ష్యంలో 48.12 శాతం సాధించినట్టు తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.44,068 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు వెల్లడించింది. ఈ రంగంలో 81 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు వివరించింది. రూ.70 కోట్ల విద్యా రుణాలు, రూ.882 కోట్ల హౌసింగ్ రుణాలు ఇచ్చినట్టు తెలిపింది. అలాగే, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.17,315 కోట్ల రుణాలు, స్వల్పకాలిక రుణాలు రూ.11,929 కోట్లు చెల్లించినట్టు ఎస్ఎల్బీసీ పేర్కొంది.