Harish Rao | ఖైరతాబాద్, డిసెంబర్ 14: రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి, ఎ మ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కీలకమైన విద్యా, సాంఘిక, గిరిజన శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారని, ఆయన శాఖల పరిధిలోనే విద్యార్థులు వరుస మరణాలకు ఆయన వైఫల్యమే కారణమని తేల్చిచెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురై నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతి, ఆమె కుటుంబసభ్యులను శనివా రం మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితులపై డైరెక్టర్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 10న తాండూరు గిరిజన హాస్టల్లో విషాహారం తినడం వల్ల 10 మంది విద్యార్థు లు దవాఖాన పాలైనట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా హరీశ్‌రావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాగా చదువుకొని ప్రయోజకులు కావాల్సిన ముక్కుపచ్చలారని పిల్లలను రేవంత్‌రెడ్డి సర్కారు పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు.
ఏడాది కాలంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 49 మంది విద్యార్థులను కాంగ్రెస్ సర్కార్ పొట్టనబెట్టుకున్నదని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే వారంతా చనిపోయారని తెలిపారు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారని ప్రశ్నించారు. విద్యార్థుల బాగోగులను తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి పిల్లలను చూడనీవ్వకుండా చేశారని తెలిపారు. విద్యార్థులు దవాఖానల్లో చికిత్సలు పొందితే, సర్కారు తప్పిదాలు బయటకు వస్తాయని భావించి, హాస్టళ్లలోనే ఉంచి చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. హాస్టల్లో ఏం వైద్య సదుపాయాలు ఉంటాయని ప్రశ్నించారు. దాని ఫలితంగానే పరిస్థితి విషమించిందని, దీంతో పరిస్థితి చేయి దాటిన తర్వాత నిమ్స్‌కు తీసుకువచ్చారని తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. నిజంగా ముందే వారిని జాగ్రత్తగా పెద్దాసుపత్రికి తరలిస్తే ఈ సమస్య వచ్చేది కాదని చెప్పారు.
రేవంత్‌రెడ్డినే సస్పెండ్ చేయాలి
తీవ్రమైన ఘటనలు జరిగితే సస్పెండ్ చేస్తామని హెచ్చరిస్తున్నారని, కానీ సస్పెండ్ చేయాల్సింది రేవంత్‌రెడ్డినే అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్ల నాణ్యత లోపించిందని, వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాళ్లను బెదిరిస్తే ఏం వస్తుందని, ఐదారు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నేటికీ పిల్లలకు షూస్, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు అందలేదని, అన్నం సరిగా పెట్టడం లేదని, మెనూ సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. నిత్యం పాము, కుక్క, ఎలుక కాట్లకు గురవుతూ, కరెంటు షాక్ వల్ల, విషాహారంతో విద్యార్థెంలదరో దవాఖానల పాలవుతున్నారని చెప్పారు. ఇటీవల నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో సాయిగణేశ్ అనే విద్యార్థి పాముకాటుకు గురై దవాఖానలో చేరాడని గుర్తుచేశారు. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. విద్యార్థుల పరామర్శకు వెళ్లిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని హరీశ్‌రావు విమర్శించారు.
పురుగుల కిచిడీ పెట్టారు
పురుగుల కిచిడీ పెడితే ప్రశ్నించినందుకే లీలావతిని కొట్టారని, అది తినడం వల్లే ఆమె కు ఇబ్బంది వచ్చిందని తేలిందని హరీశ్‌రావు విమర్శించారు. తాండూరులో ఉన్న తొమ్మిది మంది విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే పెద్దాసుపత్రిలో చేర్పించాలని సూచించారు. కేసీఆర్ పాలన సంక్షేమమైతే, రేవంత్ పాలన సంక్షోభానికి నిదర్శనం అని పేర్కొన్నా రు. సీఎం చెప్తున్నట్టు గ్రీన్‌చానెల్ మాటలకే పరిమితమైందని, అందులో నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. సిద్దిపేటలోని ఓ హా స్టల్కు తాము వెళ్తే ఆరు నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసిందని, సీఎం మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ పెద్దల మీద ఉన్న ప్రేమ.. విద్యార్థులపైన లేదని విమర్శించారు.
సకాలంలో చేరిస్తే ఈ దుస్థితి వచ్చేదికాదు
సకాలంలో దవాఖానలో చే ర్పించి ఉంటే లీలావతికి ఈ దుస్థితి వచ్చేది కాదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం నుంచి ఇప్పటివరకు లీలావతి స్లైన్తోనే ఉన్నదని తెలిపారు. ఫుడ్‌పాయిజన్‌తో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని తాము హాస్టల్‌కు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. అటు తల్లిదండ్రులను కూడా పిల్లలను చూడనివ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు హాస్టల్లోనే ఉంచి చికిత్స అందించారని విమర్శించారు. దవాఖానలో ఉన్న విద్యార్థులకు సరైన వైద్య చికిత్సలు అందించి, నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని కోరారు.
పదే పదే ప్రభుత్వ నిర్లక్ష్యం
వాంకిడిలో ఇలాంటి సంఘటన జరిగితే తొలుత పిల్లలను వాంకిడితోపాటు, ఆసిఫాబాద్, మంచిర్యాలకు దవాఖానలకు తిప్పారని, చేతులు దాటాక నిమ్స్‌కు తీసుకొస్తే మక్కుపచ్చలారని విద్యార్థిని శైలజ చికిత్స పొందుతూ మృతి చెందిందని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం మళ్లీ అదే నిర్లక్ష్యం చేస్తున్నదని, ఐదు రోజులుగా తాండూరు విద్యార్థిని లీలావతిని హాస్టల్లో ఉంచి చికిత్స అందించారని, సీరియస్ అయ్యాకే నిమ్స్‌కు తీసుకొచ్చారని విమర్శించారు. ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సిన పిల్లలను సీఎం రేవంత్‌రెడ్డి దవాఖానల పాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
చలికాలం వచ్చిన నేపథ్యంలో సీఎం, మంత్రులు ఏదో యాత్ర చేపట్టారు. ప్రతిపక్షం నిత్యం తిడుతుంటే, తప్పిదాలు ఎత్తిచూపుతుంటే మెల్లగా టూర్లకు పోతున్నారు. చలికాలం ఆడపిల్లలు చలితో వణికి పోతున్నారు. వేడినీళ్ల సరఫరా లేదు. షూస్ ఇవ్వలేదు, బాత్రూమ్, వాష్‌రూముల్లో పరిశుభ్రత లేదు, కిటికీలు, తలుపులు సరిగా లేవు. కనీసం విద్యార్థులను కలిసి వారి బాధలు తెలుసుకోలేని అసమర్థత ఈ ప్రభుత్వానిది. – హరీశ్‌రావు