బుకాయింపు!
దబాయింపు! తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నదిదే!
బనాయింపు!
అడిగితే కేసు!
ప్రశ్నిస్తే అరెస్ట్! తెలంగాణ ఇప్పుడు చూస్తున్నదిదే!
నిలదీస్తే నిర్బంధం
బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దమనకాండ
30 మందికిపైగా అరెస్ట్
నిర్బంధకాండ.. కాంగ్రెస్ ఏడో గ్యారెంటీ!
నియంతస్వామ్యం.. దాని ట్రేడ్‌మార్క్ పాలసీ!
ఎగవేసిన ఒక్కొక్క హామీ నైలాన్తాడులా మెడకు చుట్టుకుంటున్నది. దగాపడిన ప్రతి సెక్షన్ దండు కడ్తున్నది. అన్నివర్గాల్లో అసంతృప్తి అగ్నిపర్వతంలా మరుగుతున్నది. అడుగడుగునా సర్కారు వైఫల్యం కనిపిస్తున్నది. ప్రజాపాలనలో ప్రజలు రోడ్డెక్కని రోజే లేదు. అందుకే, ‘అధికారం’ గుండెల్లో దడ పుడుతున్నది. ప్రశ్నిస్తేచాలు తట్టుకోలేకపోతున్నది. బీఆర్ఎస్ మరింత బలపడుతున్న సంకేతాలతో కడుపులో దుగ్ధ రగులుతున్నది. తిట్లతో ఆ అసహనం తగ్గేలా లేదు. మొత్తం బీఆర్ఎస్ పార్టీనే జైల్లో వేయాలన్నంతగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నది. అందుకే కేసుల కుట్రలకు పాల్పడుతున్నది.
ఒకవైపు ఏడాది ఉత్సవాలు.. మరోవైపు ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీ దృశ్యాలు.. ప్రతిపక్షం సలహాలివ్వాలని ముఖ్యమంత్రి వేదికలపై నీతులు చెప్తారు. కానీ తప్పుల్ని ఎత్తిచూపితే మాత్రం కేసులు పెడ్తారు. బయటకురాకుండా గృహనిర్బంధం చేస్తారు. అయినా మాట్లాడితే.. అరెస్టు చేసి లోపలేస్తారు. లగచర్ల రైతు తిరుగుబాటుకు బీఆర్ఎస్తో ముడిపెట్టారు. సంబంధం లేని పట్నంను 20 రోజులు జైల్లో పెట్టారు. గురుకులాలను గాలికొదిలేశారు. పైగా బీఆర్ఎస్దే కుట్ర అంటారు. పరిశీలనకు వెళ్తే అడ్డగిస్తారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. కేటీఆర్‌పై పదులసంఖ్యలో కేసులు! హరీశ్‌పై తప్పుడు ఎఫ్ఐఆర్లు! బీఆర్ఎస్ శ్రేణులపై లెక్కకుమించి నిర్బంధాలు!
తనపై నిఘా పెట్టారని, ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ ఫిర్యాదు ఇస్తే ఆయనపైనే ఉల్టా కేసు!
ఎట్లా అరెస్ట్ చేస్తారని స్టేషన్‌కు వెళ్తే హరీశ్ సహా నేతల అరెస్ట్!
ఈ తప్పుడు కేసులేందని ధర్నా చేస్తే బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జి!
ఇదేం పద్ధతి అని ఆందోళన చేపడితే వారిపైనా పోలీస్ కేసులు!
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) /బంజారాహిల్స్/శేరిలింగంపల్లి/కొండాపూర్ : తెలంగాణలో మళ్లీ ఉద్యమకాలం నాటి పరిస్థితులు దాపురించాయి. ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలు, అరెస్టులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రశ్నించినా.. నిలదీసినా కేసులు పెట్టి లోపలేసే దుస్థితి వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కడివారిని అక్కడే పోలీసులను ముందుపెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తుండటం, పరామర్శలకు వెళ్లిన నేతలను కూడా ఠాణాల్లో బందీలుగా మార్చడం కాంగ్రెస్ సర్కార్ నిర్బంధకాండకు అద్దం పడుతున్నది.
బీఆర్ఎస్ ముఖ్యనేతలతో పాటు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోసం వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనే కేసు పెట్టిన పోలీసులు, గురువారం ఆయనను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. ఇదేమిటని ప్రశ్నించి అడ్డుకున్నందుకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. కౌశిక్‌రెడ్డిని నోటీసులిచ్చి బయటకు పంపకుండా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో రాత్రి వరకు ఆయనను ఠాణాలోనే ఉంచారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలను నిరసిస్తూ సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పలుచోట్ల లాఠీ ఝులిపించారు.
గురువారం తెల్లవారుజామునే కొండాపూర్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసముంటున్న కొల్లా లగ్జరియా విల్లాస్ వద్ద బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. వీరికి తోడుగా గచ్చిబౌలి పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చారని తెలిసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అక్కడికి చేరుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మరింతమంది బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకోకుండా విల్లాస్ ప్రధాన గేట్‌ను పోలీసులు మూసేయించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గేటు దూకి కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు.
కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారని సైబరాబాద్ పోలీసులు ముందస్తుగా హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తదితరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పీఎస్‌కు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులను అరెస్ట్ చేసి రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. ‘నాకు వారెంట్ చూపించాలి, నాపై ఏమేం కేసులు నమోదయ్యాయి? వాటిల్లో ఉన్న సెక్షన్లు ఏంటి? నా అరెస్టుకు స్పీకర్ అనుమతి ఇచ్చారా?’ అని కౌశిక్‌రెడ్డి పోలీసులను నిలదీశారు. పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆయన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అయినా లెక్కచేయని పోలీసులు తలపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బలంతంగా వాహనం ఎక్కించి నేరుగా బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. మీడియాతో మాట్లాడనీయకుండా ఆంక్షలు పెట్టారు. అరెస్ట్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఇంటి పరిసరాల్లో వందలాదిమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు, నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేందుకు అవకాశాలున్నా రాత్రి పొద్దుపోయే దాకా పీఎస్‌లోనే నిర్బంధించారు. రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి కొత్తపేటలోని న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు. వాదనలు విన్న జడ్జి.. రిమాండ్‌ను తిరస్కరించారు. కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేయడంతో పాటు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మణ్ తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద న్యాయవాది లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన మీద నమోదైన కేసు వివరాలు కూడా ఇవ్వలేదని చెప్పారు. నిందితుడి కుటుంబసభ్యులకు గాని, ఆయన తరఫు న్యాయవాదికి గాని ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డిపై నమోదైన కేసులు ఏడేళ్ల లోపు శిక్ష ఉన్నవి కాబట్టి నోటీసులు ఇస్తే సరిపోయేదని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించడం సరికాదని చెప్పారు.
ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యేపై, ఇతర నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. అక్రమకేసు నమోదు చేయడమే కాకుండా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని, ఎఫ్ఐఆర్ను గోప్యంగా ఉంచి అరెస్ట్ చేయడమేమిటని నిలదీశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వచ్చిన హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పదేండ్ల పాటు కేసీఆర్‌గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారన్న విషయం తెలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గచ్చిబౌలి పీఎస్‌కు చేరుకొని హరీశ్‌రావును, ఇతర నేతలను పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, మాగంటి గోపీనాథ్, సునీతా లక్ష్మారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మహమూద్ అలీ, మర్రి జనార్దన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు గచ్చిబౌలికి చేరుకొని హరీశ్‌తో మాట్లాడారు.
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బలవంతంగా చెదరగొట్టి.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, బీఆర్ఎస్ మహిళా నేతలు సుమిత్రా ఆనంద్, రజితారెడ్డి, మమత తదితరులును అరెస్టు చేసి మోకిల ఠాణాకు తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకొని ఆందోళన కొనసాగించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాక్షస పాలన నశించాలని నినదిస్తూ హరీశ్‌రావును, ఇతర బీఆర్ఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల శ్రీధర్‌రెడ్డి తదితరులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వారిని లోనికి రానివ్వకుండా గేట్లు మూసి ఉంచడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కాసేపటికి లోనికి అనుమతించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. అక్రమ కేసులపై పార్టీ పరంగా పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలను ఆయా పోలీస్స్టేషన్లకు తరలించిన పోలీసులు.. వారిపట్ల కర్కశంగా ప్రవర్తించారు. ఉదయం నుంచి ఆందోళనల్లో ఉన్న వారిని ఆయా స్టేషన్లకు తరలించి కనీసం వారిని భోజనాలకు కూడా అనుమతించలేదు. వారు ఏ స్టేషన్లో ఉన్నారనే సమాచారం కుటుంబసభ్యులకు, ముఖ్యనేతలకు చెప్పే అవకాశం లేకుండా ఫోన్లు మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారు. కొందరిని కాలకృత్యాలకు కూడా అనుమతించలేదు. స్టేషన్లలో ఫొటోలు తీయ్యొద్దని, వాటిని ఎవరికైనా పంపితే ఫోన్లు సీజ్ చేస్తామని బెదిరించారు. తమను పోలీసులు తీవ్రవాదులను చూసినట్టు చూశారని, దురుసుగా ప్రవర్తిస్తూ హేళనగా మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.