హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై (BRS) కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న గులాబీ పార్టీ నేలతను పోలీసుల సహాయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. సిటీ బస్సుల్లో పెంచిన చార్జీలను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) గురువారం ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్‌భవన్‌కు చేరుకుంటారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు.
ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీశ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందా, కొత్త ప్రభాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును గృహనిర్బంధం చేశారు. అదేవిధంగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, శామీర్‌పేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు బాస్కర్ యాదవ్, నవీన్ రెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్ బస్‌భవన్ ముట్టడి నేపథ్యంలో బస్‌భవన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు.