Congress | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తల్లకిందులుగా చూపి.. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెల్లో తప్పులను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. శ్వేతపత్రంలో చూపెట్టిన అంకెలకు.. కాగ్ విడుదల చేసిన నివేదికల్లోని అంకెలకు మధ్య పొంతన కుదరకపోవడాన్ని సూటిగా ప్రశ్నించడంతో.. సీఎం రేవంత్‌తోపాటు, మంత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సమాధానం చెప్పలేక రాజకీయ విమర్శలకు దిగారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఏర్పాటు వరకు ఆర్థిక అంశాలపై పరస్పర విభిన్నమైన అంకెలను ప్రదర్శించిన ప్రభుత్వ పక్షం.. వాటిని గట్టిగా సమర్థించుకోవడంలో విఫలమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి అనేక కమిటీల నివేదికలను ఔపోసన పట్టిన హరీశ్‌రావు స్పష్టంగా, సూటిగా నివేదికల్లోని అంశాలను బయటపెట్టడంతో.. కాంగ్రెస్ నేతలు తెల్లమొహాలేయడం తప్పితే.. తడుముకోకుండా సమాధానాలు మాత్రం చెప్పలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇటు అంకెల్లో.. అటు విమర్శలు చేయడంలో.. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో అధికారపక్షం బుధవారంనాడు పూర్తిగా వెనుకబడింది. ప్రతిపక్షాల నుంచి అంత స్పష్టంగా.. గణాంకాలతోసహా ప్రశ్నలు సంధిస్తారని బహుశా ఊహించలేకపోయినవారు ఒక్కో ప్రశ్నకు సమాధానం కోసం వెతుక్కునే క్రమంలో.. రాజకీయ విమర్శలకు దిగారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. అసెంబ్లీ కార్యకలాపాలలో శ్వేతపత్రం విడుదల చేయడమే ఇప్పటివరకు అతిపెద్ద సంఘటన. అసెంబ్లీలో ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రభుత్వం వేసిన మొదటి అడుగే తడబడింది. అంకెల్లో తేడాలను వివరించడంలో.. ఇటు ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలకు సహేతుకంగా సమాధానాలు చెప్పకపోవడంతో శ్వేతపత్రం ‘తెల్ల’బోయినట్టయ్యింది..!