హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : సిగాచి ప్రమాద బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి ధోకా చేశారని, 54 మంది బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని నమ్మించి సగం కూడా ఇవ్వకుండా నట్టేట ముంచారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆ పూటకు మాటలు చెప్పడం, ఆ తర్వాత తప్పడం రేవంత్‌రెడ్డికే చెల్లిందని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా దెప్పిపొడిచారు. ‘ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం 54 మంది సిగాచి పరిశ్రమ బాధితులకు ఇప్పటివరకు చెల్లించిన పరిహారం రూ. 24.51 కోట్లు. విభజించి చూస్తే ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం రూ.45.40 లక్షలు మాత్రమే.
అందులో ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.లక్షనే. మొత్తంగా సీఎం ప్రకటించిన పరిహారంలో సగం కూడా వారికి చేరలే. సిగాచి యాజమాన్యం, సర్కార్ కుమ్మక్కయి ఒక్కో కుటుంబానికి రూ.54.60 లక్షల చొప్పున, మొత్తం రూ. 29.48 కోట్లు ఎగ్గొట్టినయ్. బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ ఆడుతున్న బూటకపు నాటకం చట్టసభల సాక్షిగా బట్టబయలైంది’ అని విరుచుకుపడ్డారు. అన్ని వర్గాల మాదిరిగానే సిగాచి బాధితులను సైతం దగా చేసిన రేవంత్‌రెడ్డి, నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారని ఎద్దేవాచేశారు. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాల సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ ఒక్కో బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించారని, కానీ ఇదంతా కంటితుడుపు వ్యవహారమేనని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని హరీశ్ విమర్శించారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో ఇది తేటతెల్లమైందని ధ్వజమెత్తారు.
సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిండ్రు. కానీ ఇదంతా కంటితుడుపు వ్యవహారమే అయింది. బాధితులకు జరిగిన న్యాయం శూన్యం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాట ఇవ్వడం, తప్పడం అలవాటుగా మారింది.
-హరీశ్‌రావు
సిగాచి యాజమాన్యం, ప్రభుత్వం కూడబలుక్కొని కార్మికుల కుటుంబాలకు తీరని అన్యాయం చేశాయని హరీశ్ విమర్శించారు. రూ. 40 లక్షల నుంచి రూ.42 లక్షలు ఇస్తున్నామని కోర్టుల ముందు ఒప్పుకొన్న యాజమాన్యం వాస్తవానికి ఇచ్చింది రూ.25 లక్షలు మాత్రమేనని తెలిపారు. చనిపోయిన కార్మికుల కష్టార్జితమైన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కలుపుకొని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దవాఖానలో మరణించిన వారి చికిత్స ఖర్చులను సైతం పరిహారంలో కోత విధించడం దారుణమని వాపోయారు. కార్మికుల కష్టార్జితాన్ని పరిహారం లెక్కల్లో చూపించడం సర్కార్, యాజమాన్యం అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట అని అభివర్ణించారు. ప్రమాదంలో కాలిబూడిదై ఆచూకీ దొరకని ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గపు ప్రభుత్వమిదని మండిపడ్డారు.
సిగాచి ఫ్యాక్టరీ ఘటన ప్రమాదం కాదని, యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని, ఇది తాను చెప్పడం లేదని, విచారణలో తేటతెల్లమైందని తెలిపారు. ‘818 హెచ్‌పీ కెపాసిటీ యంత్రాలకు అనుమతులు తీసుకొని అక్రమంగా 1777 హెచ్‌పీకి పెంచారు. సేఫ్టీ గార్డ్స్ లేవు. ఫైర్ ఎన్వోసీ లేదు. డస్ట్ కంట్రోల్ సిస్టం పనిచేయలేదు’ అని గుర్తుచేశారు. యాజమాన్య నిర్ల క్ష్యం ఆధారాలతో బయటపడ్డా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పు న పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి, వారిని ఆదుకోవాలనే సోయి ఉంటే వెంటనే వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేసి వారి ఆస్తులను అమ్మి బాధితులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని హరీశ్ డిమాండ్ చేశారు. ‘రేవంత్‌రెడ్డీ.. బతికి ఉన్నవారిని మోసం చేయడం.. ఇచ్చిన మాట తప్పడం మీకు అలవాటే. కనీసం మృతుల కుటుంబాలకు అన్యా యం చేయకండి’అని హితవు పలికారు.