సంగారెడ్డి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ముఖ్యనేతల ఫోన్లు, ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా హ్యాక్ చేయిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగళూ రు నుంచి హ్యాకర్లను ఎంగేజ్ చేసుకొని హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొందరు ఐపీఎస్ అధికారులు సహకరిస్తున్నారని, వారు చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ అధికారులను వదిలిపెట్టమని, రిటైర్ అయినా వారిపై కేసులు పెట్టి విచారణ జరిపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఆ పోలీసు అధికారులను రేవంత్‌రెడ్డి కాదు కదా ఎవ్వరూ కాపాడలేరని చెప్పారు. హ్యాకింగ్‌కు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైన సమయంలో అన్నీ బయటపెడతామని తేల్చిచెప్పారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, మరో ఏడుగురు బీఆర్ఎస్ కార్యకర్తలను మంగళవారం ఆయన పరామర్శించా రు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిశాంక్‌పై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైలులో పెట్టిందని విరుచుకుపడ్డారు. అక్రమ కేసులు పెట్టడం ద్వారా మళ్లీ అధికారంలోకి వస్తానని అనుకుంటే అది రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమేనని, మూర్ఖత్వంలో ఆయన హిట్లర్‌ను మించిపోయాడని మండిపడ్డారు.
ప్రశ్నించే హక్కును 7వ గ్యారెంటీగా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రశ్నించే వారిపైనే అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించినందుకు కేసులు పెడుతూ రాచరిక ధోరణిని కనబరుస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై క్రిశాంక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఫేక్ పోస్టులు, తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు, ఆధారాలు చూపిన క్రిశాంక్పైనే తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్రిశాంక్‌పై 308 సెక్షన్ కింద అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని, మేజిస్ట్రేట్ గమనించి 308 సెక్షన్ కొట్టివేసినట్టు చెప్పారు. క్రిశాంక్‌పై 22 కేసులు ఉన్నట్టు పోలీసులు కోర్టులో చెప్పారని తెలిపారు. క్రిశాంక్ మర్డర్ చేసిండా? రేప్ చేసిండా? టెర్రరిస్టా అని ప్రశ్నించారు.
‘అంగన్వాడీలకు టీచర్లకు ఇచ్చిన స్మార్ట్ఫోన్లలో అవినీతి జరిగిందని క్రిశాంక్ ప్రశ్నిస్తే కేసు.. కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాన్ని ప్రశ్నిస్తే కేసు.. సోం డిస్టిలరీ మందు తాగి చాలామంది చనిపోయారని ప్రశ్నిస్తే కేసు.. మిస్‌వరల్డ్ పోటీలో మిస్ ఇంగ్లండ్ పట్ల కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారని ప్రశ్నిస్తే మరో కేసు పెట్టారు. అనుముల మహానందరెడ్డి అనే వ్యక్తి ఒక కేసులో ఉంటే అందరినీ అరెస్ట్ చేసి అనుముల మహానందరెడ్డిని మాత్రం అరెస్టు చేయలేదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి న్యాయం’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని క్రిశాంక్ ప్రశ్నిస్తే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్‌రెడ్డి ఫేక్ సర్క్యులర్ పోస్టు పెడితే దానిని ప్రశ్నిస్తే క్రిశాంక్ మీద మరో కేసు పెట్టారు. క్రిశాంక్‌పై బనాయించిన కేసులు ఎత్తివేసి ఆయన్ను, బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అక్రమాలన్నీ ప్రజల దృష్టిలో, బీఆర్ఎస్ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి పని అయిపోయిందని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ప్రజలకు అర్థమైందని త్వరలో వాళ్లే బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని రేవంత్‌రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో రూ.100 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారని, అవన్నీ బయటపెడతామని స్పష్టంచేశారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరువలేదు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాలు తీస్తే తోలు తీస్తానని హెచ్చరికలు చేసి ఇప్పుడు సీఎం కాగానే ఆ విషయం మరచిపోయారా?. యాసంగి వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఆరు కిలోల వరకు తాలు పేరుతో ధాన్యం కటింగ్ చేస్తున్నరు. ఇప్పుడు ఎవరి తోలు తీయాలో రేవంత్‌రెడ్డి చెప్పాలె.
– హరీశ్‌రావు
‘ఓ వైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా?’అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు జూబ్లీహిల్స్ ప్యాలెసుల్లోని ఏసీ గదుల్లో ఉంటే రైతులు మాత్రం ఎర్రటి ఎండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద మాడిపోతున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం 20 రోజులుగా శనగలు, మక్కలు, పొద్దుతిరుగుడు కొనుగోలు నిలిపివేయడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రైతులు 13 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగుచేస్తే ఇప్పటివరకు 50శాతం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. అరకొర ధరకు బహిరంగ మార్కెట్లో అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నల్లగొండ జిల్లాలో మిల్లర్ల వద్ద ధాన్యం దించుకోకపోవటంతో ఒక్కో మిల్లు వద్ద 50 నుంచి 60 లారీలు నిలిచి ఉన్నట్టు చెప్పారు.
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగులు, ప్యాడీ క్లీనర్లు లేక రైతులు ఎండలో మాడిపోతున్న్ట చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులను పట్టించుకునే దిక్కులేకుండాపోయిందని అన్నారు. మక్క, శనగ, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తానని హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదని కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వడ్లకు బోనస్ ఇస్తామని రూ.1,560 కోట్లకు రేవంత్‌రెడ్డి ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఈ యాసంగిలోనైనా బోనస్ చెల్లిస్తారా? లేక రైతులకు క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకుంటారా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.