హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్‌గోల్ చేసుకున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎక్కడైనా సర్వే చేస్తే జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే, ఆధార్‌కార్డులు, ఓటరు లిస్టుల ఆధారంగా బీసీల జనాభా 50 శాతానికిపైగా ఉన్నట్టు తేలిందని తెలిపారు. తాజాగా ప్లానింగ్ శాఖ చేపట్టిన సర్వేలో బీసీలు 46% మా త్రమే ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆ సామాజికవర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతున్నదని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌లో స్థానికసంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డంకులు ఉన్నాయని ప్రభుత్వానికి ముందే తెలుసని అన్నారు. హామీల అమలు చేతకాక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంలో చేసేదేమీలేక పార్టీ తరఫున టికెట్లు ఇస్తాం.. మీరు ఇవ్వండంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొత్తడ్రామాకు తెరలేపారని విమర్శించారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయింపులు జరుపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. క్యాబినెట్లో మరికొంత మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్‌కు బీసీలపై ప్రేమ ఉంటే బీసీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. క్యాబినెట్లో సమతుల్యత పాటించకుండా బీసీలకు ఎలా న్యాయం చేస్తారని నిలదీశారు. బీసీలకు గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వే నివేదికలో ఏ కులానికి చెందిన వారు ఎంతమంది అనే విషయాన్ని వెల్లడించకపోవడంపై సందేహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఎమ్మెల్యేలకు పది నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడటం ఖాయమని, రాష్ట్రంలో తప్పకుండా ఉపఎన్నికలు వస్తాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే పదికి పది స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో లేరని, కేసీఆర్ పాలనే బాగున్నదనే అభిప్రాయం ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఈ నెలలో నిర్వహించే భారీ బహిరంగ సభ తేదీ, వేదికను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిద్దామని కేసీఆర్ సూచించారని తెలిపారు.
పార్టీలో కమిటీల ఏర్పాటు విషయమై స్పందిస్తూ.. పార్టీ నియమావళి ప్రకారం ప్రతి నాలుగేండ్లకు పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు. 2025 అక్టోబర్ నాటికి అధ్యక్షుడి పదవీకాలం ముగుస్తుందని వెల్లడించారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. తర్వాత గ్రామ, వార్డు, మండల, పట్టణ అధ్యక్షులను ఎన్నుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ఉంటుందని, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గం, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని వివరించారు.