హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ దుష్ప్రచారం మరింత పెరిగింది. మొన్నటికి మొన్న ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రతిపాదన రాలేదని బొంకిన కేంద్రం, పార్లమెంట్ వేదికగా మరోసారి నాలుక మడతేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు మెడికల్ కాలేజీలు కేటాయించలేదు? అని ఓ సభ్యుడు లోక్‌సభలో ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాలేజీల కోసం ప్రతిపాదనలే రాలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ సమాధానమిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద ప్రస్తుతం ఉన్న జిల్లా దవాఖానలకు అనుబంధంగా కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. మూడు దశల్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదు’ అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌కు 26, రాజస్థాన్‌కు 23, మధ్యప్రదేశ్‌కు 12, బెంగాల్‌కు 12, తమిళనాడుకు 11, జమ్ముకశ్మీర్‌కు 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. చివరికి అండమాన్ నికోబార్‌కు కూడా ఒక కాలేజీ ఇచ్చింది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మెరుగైన స్థానంలో ఉన్న తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు నిదర్శనం.
రాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు నిజాం హయాంలోనే స్థాపించారు. అంటే ఉమ్మడి పాలనలో వచ్చినవి కేవలం మూడు. హైదరాబాద్‌తోపాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర నిధులతో 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 8 కాలేజీల పనులు తుది దశకు చేరాయి. ఈ ఏడాది 8, వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తాజా బడ్జెట్లో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంగా ప్రకటించారు. కాలేజీల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కల సాకారం కానున్నది. ఇందులో ఎక్కడా కేంద్రం నుంచి నయాపైస రాలేదు. అయినా కేంద్రం దుష్ప్రచారం మాత్రం ఆపడం లేదు.
మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ప్రతిపాదనలు పంపలేదన్నది పచ్చి అబద్ధం. మొన్న తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు రాలేదని చెప్పిన కేంద్రం.. ఈ రోజు మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా పచ్చి అబద్ధాలు వల్లె వేసింది. ఏకంగా పార్లమెంట్‌లోనే గోబెల్స్ ప్రచారానికి దిగింది. మెడికల్ కాలేజీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విన్నవించింది. అయినా ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
– వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్.
2015 జూన్ 21
సీఎస్ఎస్ కింద రాష్ట్రంలోని జిల్లా దవాఖానలను మెడికల్ కాలేజీలుగా అభివృద్ధి చేయాలని నాటి రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు.
2015 నవంబర్ 26
సీఎస్ఎస్ జాబితాలో రాష్ట్రం అభ్యర్థించిన దవాఖానలు లేవని జేపీ నడ్డా ప్రత్యుత్తరం పంపారు.
2019, ఆగస్టు 8
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి మరోసారి విన్నవించింది.
2019 ఆగస్టు 30
ఫేజ్-1, ఫేజ్-2లో తెలంగాణకు అవకాశం రాలేదని కేంద్ర మంత్రి చెప్పారు. ఫేజ్-3లో దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని మెలికపెట్టారు.